స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు భారీగా తగ్గిపోయింది

  • Published By: venkaiahnaidu ,Published On : June 26, 2020 / 09:26 AM IST
స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు భారీగా తగ్గిపోయింది

స్విస్ బ్యాంక్‌లో భారతీయుల నగదు నిల్వలు భారీగా తగ్గాయి. 2019లో భారతీయుల డిపాజిట్లు 6 శాతం తగ్గి రూ.6,625 కోట్లకు పరిమితమయ్యాయని స్విస్‌ బ్యాంకు ప్రకటించింది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో బ్యాంక్ ఈ వివరాలు పేర్కొంది. ఈ డిపాజిట్లలో భారత్‌లో విస్తృతంగా చర్చలో ఉన్న నల్లధనం కూడా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ డిపాజిట్లన్నీ భారత్‌కు చెందిన పలువురు వ్యక్తులు, సంస్థలు, ఎన్‌ఆర్‌ఐల పేరు మీద ఉన్నట్లు స్విస్ బ్యాంకు తెలిపింది. భారత్‌, స్విర్జర్లాండ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో ఈ నగదు నిల్వలు ఉన్నాయి.

స్విస్ బ్యాంకులో గత రెండేళ్లుగా భారతీయ డిపాజిట్లు గణనీయంగా పడిపోయాయి. భారత్‌తో పాటు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన నగదు నిల్వలు తగ్గగా.. అమెరికా, బ్రిటన్‌ వాటా పెరిగినట్లు స్విస్‌ బ్యాంకు వెల్లడించింది. స్విస్ బ్యాంక్‌లో భారతీయుల డిపాజిట్లు 2007లోనే రూ. 9 వేల కోట్లకు చేరుకున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని పేర్కొనడంతో స్విస్ బ్యాంక్‌లో నగదు నిల్వలు భారీగా పడిపోయాయి. ఒక్క 2017 సంవత్సరంలోనే 44 శాతం తగ్గాయి. 2018లో 11 శాతం తగ్గాయి. వరుసగా మూడో ఏడాది కూడా తగ్గుదల కనిపించింది.

స్విస్ బ్యాంకులో ఖాతాలు ఉన్న దేశాల్లో భార‌త్ 77వ స్థానంలో నిలిచింది. స్విస్ బ్యాంక్ ఖాతాల్లో టాప్ ప్లేస్‌ను బ్రిట‌న్ చేజిక్కించుకున్న‌ది.  2018లో 74వ స్థానంలో ఉన్న భార‌త్‌.. ఇప్పుడు 77వ స్థానానికి ప‌డిపోయింది. 

స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచిపెట్ట‌న సొమ్ములో భార‌త వాటా కేవ‌లం 0.06 శాతం మాత్ర‌మే ఉన్న‌ట్లు స్విస్ నేష‌న‌ల్ బ్యాంక్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది. ఇక అత్య‌ధిక స్థాయిలో సొమ్ము దాచిన దేశాల్లో బ్రిట‌న్ మొద‌టిస్థానంలో ఉన్న‌ది. స్విస్ విదేశీ ఫండ్‌లో బ్రిట‌న్ వాటా 27 శాతం ఉన్న‌ట్లు తేలింది. ఎస్ఎన్‌బీ డేటా ప్ర‌కారం.. స్విస్ బ్యాంకులో భార‌తీయులు సొమ్ము భ‌ద్ర‌ప‌రిచే విధానం 5.8 శాతం ప‌డిపోయిన‌ట్లు స్ప‌ష్ట‌మైంది.  

Read: ఓసామాబిన్ లాడెన్ అమరవీరుడంటూ పార్లమెంట్‌లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు