ప్రపంచవ్యాప్తంగా కాటేస్తున్న కరోనా…లక్ష దాటిన మృతుల సంఖ్య…16 లక్షలకుపైగా బాధితులు

కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : April 10, 2020 / 05:19 PM IST
ప్రపంచవ్యాప్తంగా కాటేస్తున్న కరోనా…లక్ష దాటిన మృతుల సంఖ్య…16 లక్షలకుపైగా బాధితులు

కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా భూతం ప్రపంచాన్ని కబళిస్తోంది. ప్రతిరోజూ వేలాది మందిని ఆ మహమ్మారి కాటు వేస్తూ… ప్రపంచదేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. దీంతో కరోనా కాటుకు బలైన వారి సంఖ్య లక్ష దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే లక్షా 260మంది మరణించారు. ఇందులో అత్యధిక మరణాలు ఇట‌లీలో సంభవించగా…. ఆ త‌ర్వాత స్థానంలో అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్‌ ఉన్నాయి. మొత్తంగా ఇప్పటివరకు 16లక్షల 40వేలకు పైగా కరోనా కేసులు నమోదవగా… 3 లక్షల మందికిపైగా బాధితులు కోలుకున్నారు. 

ఫ్రాన్స్ లో 10వేల 328 మృతి 
కరోనా వైరస్ ప్రభావంతో ఫ్రాన్స్ విలవిల్లాడుతోంది. ఆ దేశంలో ఒక్కరోజే 1417 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకూ వైరస్ బారినపడి 10 వేల మందికిపైగా చనిపోయారు. నిన్న ఆ దేశంలో 11వేలకు పైగా కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. మరణాల సంఖ్య 10వేల 328కి చేరింది.

స్పెయిన్‌లో 14వేల మంది మృత్యువాత
స్పెయిన్‌లో క‌రాళ‌నృత్యం చేసిన క‌రోనా కాస్త శాంతించింది. అక్కడ వ‌రుస‌గా ఐదోరోజు క‌రోనా మ‌ర‌ణాలు త‌గ్గాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో మృతుల సంఖ్య 571కి ప‌రిమిత‌మైంది. గ‌త రెండు వారాల్లో ఇది చాలా త‌క్కువ‌ని అక్కడి అధికారులు తెలిపారు. కొత్తగా న‌మోదవుతున్న క‌రోనా కేసులు 3.3 శాతం త‌గ్గినట్లు వివ‌రించారు. ఇప్పటివ‌ర‌కు స్పెయిన్‌లో లక్షా 40వేల మందికిపైగా క‌రోనా బారిన ప‌డ‌గా.. దాదాపు 14వేల మంది మృత్యువాత ప‌డ్డారు. 43వేల మంది క‌రోనా నుంచి కోలుకోగా 83వేల మందికిపైగా బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. మరో 7వేల మంది ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

రష్యాలో 58 మంది మృతి 
రష్యాలో నిన్నమొన్నటివరకు పెద్దగా కనిపించని కరోనా  ఇపుడు విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే  11వందలకుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7వేల 497కు చేరింది. రష్యాలో ఇప్పటివరకు కరోనా కారణంగా 58మంది మరణించారు. వైరస్‌ రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో రష్యా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టింది.  అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించటంతోపాటు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

బ్రిటన్‌లో 6,159కి పెరిగిన మృతుల సంఖ్య  
బ్రిటన్‌లో కరోనా మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 786 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణించిన వారి సంఖ్య 6,159కి పెరిగింది. అక్కడ మొత్తం 55వేల 242 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా మహమ్మారి బారినపడి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన లండన్ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్‌ కేర్ వార్డులో చికిత్స పొందుతున్నారు. సీనియర్ మంత్రి మైఖేల్ గోవ్‌లోనూ కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నారు. 

జ‌పాన్ లో 92 మంది మృతి
క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ‌..జ‌పాన్ మరింత అప్రమ‌త్తమైంది. క‌రోనాను పూర్తిగా నియంత్రించేందుకు దేశంలోని ప‌లు ప్రాంతాల్లో నెలరోజుపాటు ఎమర్జెన్సీ ప్రక‌టించింది. దీంతో టోక్యో, ఒసాకాతో పాటు మ‌రో ఐదు న‌గ‌రాల్లో ఎమ‌ర్జెన్సీ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే మాల్స్‌, సినిమా థియేట‌ర్లు, బార్లు, ప‌బ్బులు మూసివేయగా… బ్యాంకులు, సూప‌ర్ మార్కెట్‌లు ఓపెన్ చేసి ఉంటాయ‌ని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ప్రజ‌లంతా ఇళ్లల్లోనే ఉంటూ సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని జపాన్ ప్రధాని షింజో అబే పిలుపునిచ్చారు. ఇప్పటికి జ‌పాన్‌లో 4వేల‌కు కోవిడ్ కేసులు ఉండ‌గా 92 మంది మృతి చెందారు. 592 మంది రిక‌వ‌రీ కాగా 3వేల 222 యాక్టివ్ కేసులున్నాయి.