ముకేశ్ అంబానీ మరో సంచలనం: ప్రపంచంలోని టాప్ 100లో రిలయన్స్ ఇండస్ట్రీస్

ముకేశ్ అంబానీ మరో సంచలనం: ప్రపంచంలోని టాప్ 100లో రిలయన్స్ ఇండస్ట్రీస్

భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో మైలురాయిని చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఏ ఇండియన్ కంపెనీ సాధించని ర్యాంకుని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేరుకోగలిగింది. ఫలితంగా గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో టాప్ 100లోకి చేరింది. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకుల్లో కంపెనీ బెటర్ పొజిషన్ కు చేరుకుంది.

టాప్ 100లోకి వెళ్లడం రిలయన్స్ కు కొత్త కాదు. 2012లోనే తొలి సారి చేరింది. అపుడు కంపెనీ 99వ ర్యాంకు సాధించగా 2016 నాటికి కాస్త వెనక్కువెళ్లి 215 స్థానానికి పడిపోయింది. ర్యాంకును మెరుగుపరచుకుంటూ వచ్చిన రిలయన్స్ తాజాగా 8వేల 620 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.46 లక్షల కోట్ల) ఆదాయంతో 96వ స్థానంలో నిలిచింది.

ఇదిలా ఉంటే ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) 34 స్థానాలు తగ్గి 151వ ర్యాంకుకు పడిపోయింది. 2020 ర్యాంకింగ్ ప్రకారం.. ఓఎన్‌జీసీ 30 ర్యాంకులు కోల్పోయి 190వ స్థానానికి దిగజారాయి.

ఎస్‌బీఐ మాత్రం సూపర్ ఫామ్ కొనసాగిస్తుంది. 21 స్థానాలు మెరుగుపరచుకుని 221వ ర్యాంకును సాధించింది. మిగిలిన ఇండియన్ కంపెనీలైన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) 309వ ర్యాంకుకు, టాటా మోటార్స్ 337వ ర్యాంకుకు, రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ 462లో నిలిచాయి.

ఫార్ట్యూన్ డేటా ఆధారంగా 2020 జాబితాలో Walmart 524బిలియన్ డాలర్లతో టాప్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నవి మూడూ చైనా కంపెనీలే సినోపెక్ గ్రూప్ (407 బిలియన్ డాలర్లు), స్టేట్ గ్రిడ్ (384 బిలియన్ డాలర్లు), చైనా నేషనల్ పెట్రోలియం (379 బిలియన్ డాలర్లు). రాయల్ డచ్ షెల్ ఐదో ర్యాంకు, సౌదీ ఆయిల్ దిగ్గజ కంపెనీ ఆరాంకో 6వ పొజిషన్ లో ఉన్నాయి.