మయన్మార్ విలవిల : ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్..సైన్యానికి చైనా అండ ?

మయన్మార్ విలవిల : ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్..సైన్యానికి చైనా అండ ?

Myanmar shuts down Internet : సైన్యం చేతిలో చిక్కిన మయన్మార్‌ ఇప్పుడు విలవిలలాడుతోంది.. రోజులు గడుస్తున్న కొద్ది తమ అసలు రూపం చూపిస్తున్నారు సైనిక నేతలు. ఒక్కోక్కటిగా ఆంక్షలు విధిస్తూ.. ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఫేస్‌బుక్‌ను బ్యాన్‌ చేసిన సైన్యం.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. మ‌య‌న్మార్‌లో సైనికాధికారులు తీసుకుంటున్న చర్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. ఇటీవ‌ల ప్రభుత్వంపై తిరుగుబాటుకు పాల్పడిన అక్కడి సైన్యం .. ఇప్పటికే కీలక నేత‌ల‌నంద‌రినీ గృహ‌నిర్బంధం చేసింది.. ఈ విషయంపై ఆగ్రహంగా ఉన్న ప్రజలు ఆందోళన బాట పట్టకుండా ఉండేందుకు ఇప్పుడు ఒక్కోక్కటిగా ఆంక్షలను విధిస్తోంది.

సోష‌ల్ మీడియాపై మయన్మార్‌ సైన్యం ఆంక్షలు విధించింది. రెండు రోజుల క్రితం ఫేస్‌బుక్‌ను బ్యాన్ చేసిన సైన్యం… తాజాగా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవ‌ల‌ను కూడా నిలిపివేశారు. మ‌య‌న్మార్‌లో టెలినార్ సంస్థ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను అందిస్తున్నది. అయితే త‌దుప‌రి ఆదేశాలు అందేవ‌ర‌కు ట్విట్టర్‌, ఇన్‌స్టాల‌ను ఆపేయాల‌ని ఆ సంస్థకు సైనిక ప్రభుత్వం హెచ్చరిక‌లు చేసింది. దేశ స్థిర‌త్వం కోస‌మే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తిరుగుబాటు నేత‌లు ప్రక‌టించారు.
మరోవైపు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న సూకీకి మద్ధతు పెరుగుతోంది.

ప్రజాస్వామ్య ప‌ద్ధతిలో ఎన్నికైన‌వారిని అరెస్టు చేస్తున్న విధానం ప‌ట్ల దేశ‌వ్యాప్తంగా ఉద్యమం చెల‌రేగుతున్నది. యంగ‌న్ న‌గ‌రంలోని యూనివ‌ర్సిటీలో డిఫాక్టో నేత ఆంగ్ సాన్ సూకీకి మ‌ద్దతుగా నినాదాలు చేశారు. ఇక సైన్యం తిరుగుబాటుకు చైనా పరోక్షంగా మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్‌ కంట్రీ వ్యూహాత్మకంగా మయన్మార్ సైన్యానికి సపోర్ట్ అందించిందన్న అనుమానాలున్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో మయన్మార్‌ సైన్యం, చైనా తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఏర్పడుతుందని అంచనా వేశారు.. కానీ ఎన్ఎల్డీ ఘన విజయం సాధించడంతో.. తెర వెనుక మంత్రాంగం జరిపి సైనిక పాలన తీసుకొచ్చారన్న వార్తలు వినిపిస్తున్నాయి.