అంగారకుడిపై రోవర్‌ ల్యాండ్.. ఫస్ట్ హైక్వాలిటీ వీడియో రిలీజ్

అంగారకుడిపై రోవర్‌ ల్యాండ్.. ఫస్ట్ హైక్వాలిటీ వీడియో రిలీజ్

NASA releases Mars landing video : అంగారకుడు (మార్స్)పై ఒకప్పుడు జీవం ఉండేదా? లేదో తేల్చేసేందుకు ప్రపంచ అంతర్జాతీయ పరిశోధన సంస్థ నాసా ప్రతిష్టాత్మక మార్స్ మిషన్ చేపట్టింది. నాసా పంపిన ‘పర్సెవరెన్స్‌’ రోవర్‌ అంగారక గ్రహం ఉపరితలంపై ల్యాండ్ అయింది. దీనికి సంబంధించి ఫస్ట్ హైక్వాలిటీ వీడియోను నాసా రిలీజ్ చేసింది. మార్స్ పై స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సమయంలో రికార్డు చేసిన మూడు నిమిషాల 25 సెకన్ల నిడివిగల వీడియోను విడుదల చేసింది.

ఈ వీడియోలో ‘పర్సెవరెన్స్‌’ అరుణగ్రహ ఉపరితలంపై ల్యాండ్‌ అయిన క్షణాలు రికార్డు అయ్యాయి. రోవర్‌ ల్యాండవుతున్న సమయంలో అంగారకుడిపై దుమ్ము లేచిపోవడం, పారాసూట్స్ ద్వారావ్యోమనౌక నుంచి రోవర్‌ కిందకి దిగుతుండటాన్ని వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఈ రోవర్‌లో రికార్డు స్థాయిలో 25 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లును ఇంజినీర్లు అమర్చారు. రోవర్‌ ల్యాండింగ్‌ సమయంలో రికార్డు చేయడానికి 7 కెమెరాలను ఇంజినీర్లు స్విచ్‌ ఆన్‌ చేశారు. రానున్న కొద్ది రోజుల్లో రోవర్‌ ల్యాండింగ్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు, వీడియో రికార్డింగ్‌లను రిలీజ్ చేస్తామని నాసా వెల్లడించింది.

ఇప్పటికే పర్సెవరెన్స్‌ అరుణ గ్రహ ఉపరితలానికి సంబంధించిన అద్భుతమైన ఫొటోలు పంపింది. పురాతన సూక్ష్మ జీవిత సంకేతాలను వెతకడానికి పర్సెవరెన్స్ రోవర్ జెజెరో క్రేటర్‌లోని ఒక పురాతన నది డెల్టా సమీపంలో దిగింది. వారాంతంలో ఎక్కువ సమయం గడిపిన తరువాత, ల్యాండింగ్ వీడియో, కాలిఫోర్నియాలోని పసాదేనాలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని బృందం వీడియోను షేర్ చేసింది. ఆరు ఆఫ్-ది-షెల్ఫ్ కలర్ కెమెరాలు ఎంట్రీ, డీసెంట్, ల్యాండింగ్ కోసం అమర్చారు. వివిధ కోణాల నుంచి రికార్డు చేసేలా కెమెరాలను పైకి క్రిందికి కనిపించేలా అమర్చారు. రోవర్ కు అమర్చిన ఒక కెమెరా మినహా అన్నీ వర్క్ అయ్యాయి.