నీళ్లు ఆపితే నష్టమేమీ లేదు : సింధూ జలాలపై స్పందించిన పాక్

  • Published By: vamsi ,Published On : February 22, 2019 / 10:30 AM IST
నీళ్లు ఆపితే నష్టమేమీ లేదు : సింధూ జలాలపై స్పందించిన పాక్

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న భారత ప్రభుత్వం.. రెండు దేశాల మధ్య సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని భారత వాటా నీటిని పాకిస్తాన్ కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తాజాగా పాకిస్తాన్ స్పందించింది. భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని, దీనిపై తాము ఎటువంటి ఆందోళన చెందట్లేదంటూ పాక్‌ నీటిపారుదలశాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి తెలిపారు. తూర్పు ప్రాంత నదీ జలాలను మళ్లించడంపై తమకు ఎటువంటి అభ్యంతరం, ఆందోళన చెందాల్సిన అవసచరం లేదంటూ ఆయన ప్రకటించారు. 

భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల బాధపడట్లేదని, మేం ఉపయోగించుకునే సింధు, జీలం, చీనాబ్‌ నదీ జలాల నీటిని అడ్డుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాం అంటూ ఆయన ప్రకటించారు. 1960లో కూడా తూర్పు ప్రాంత నదుల జలాలను భారత్ మళ్లించుకుందని, ఆ సమయంలో మేమేం అభ్యంతరం చెప్పలేదని, ఇప్పుడు అదే పని భారత్ చేసినంత మాత్రాన తమకేం ఇబ్బంది లేదని ఆయన అన్నారు. సింధూ జలాల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాక్‌కు దక్కగా, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌కు దక్కాయి. పుల్వామా దాడితో మనదేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలువరించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఆ నీటిని మళ్లించి జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ ప్రజలకు అందిస్తామని తెలిపారు.