కరోనా వైరస్.. గాలిలో గంటలు, ఉపరితలాలపై రోజుల పాటు బతికే ఉంటుందట

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. నిపుణుల పరిశోధనల్లో భయపెట్టే నిజాలు తెలుస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి

  • Published By: veegamteam ,Published On : March 18, 2020 / 03:29 AM IST
కరోనా వైరస్.. గాలిలో గంటలు, ఉపరితలాలపై రోజుల పాటు బతికే ఉంటుందట

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. నిపుణుల పరిశోధనల్లో భయపెట్టే నిజాలు తెలుస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. నిపుణుల పరిశోధనల్లో భయపెట్టే నిజాలు తెలుస్తున్నాయి. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. మానవ శరీరం బయట ఎంత సేపు బతికి ఉంటుంది? దాని ప్రభావం ఎంత సేపు ఉంటుంది? అనే విషయాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. గాలిలో కొన్ని గంటల పాటు, ఉపరితలాలపై కొన్ని రోజుల పాటు వైరస్ బతికే ఉంటుందని నిపుణుల అధ్యయనంలో బయటపడింది. మానవ శరీరం వెలుపల జీవించడంలో గతంలో వచ్చిన సార్స్ కు ఉన్న సామర్థ్యమే దీనికి కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బహుశా ఈ కారణం వల్లే సార్స్ కంటే కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. COVID-19 అని పిలువబడే శ్వాసకోశ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి ప్రజలకు సహాయపడే మార్గదర్శకత్వం అందించే కొత్త అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.

See Also | కరోనా ఎఫెక్ట్ : whatsappలో పరీక్షా ఫలితాలు 

గాల్లో 3గంటలు.. ప్లాస్టిక్, స్టీల్ పై 3రోజులు బతికే ఉంటుంది:
అమెరికా నేషనల్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ లో భాగమైన, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్(NIAID) శాస్త్రవేత్తలు కరోనా వైరస్ పై అధ్యయనం చేస్తున్నారు. కరోనా బారిన పడిన వ్యక్తి నుండి సేకరించిన వైరస్ ను ఇంట్లో, ఆసుపత్రిలోని ఉపరితలాలపై ఉంచారు. ఉపరితలాలపై వైరస్ ఎంత సమయం బతికి ఉంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. వారి పరిశోధనలో తేలింది ఏంటంటే.. వైరస్ గాల్లో మూడు గంటల పాటు బతికే ఉంటుంది. ప్లాస్టిక్, స్టీల్ వంటి వాటిపై మూడు రోజుల పాటు వైరస్ బతికే ఉంటుంది. కార్డుబోర్డుపై 24గంటలు ఉంటుంది. అదే కాపర్(రాగి) పై అయితే కేవలం 4 గంటలు మాత్రమే యాక్టివ్ గా ఉంటుందని గుర్తించారు.

రాగిపై తక్కువ మాత్రమే వైరస్ ప్రభావం:
వైరస్ కణాలు ఏరోసోల్ బిందువుల్లో ఉంటే ప్రభావం కోల్పోవటానికి 66 నిమిషాలు పడుతుందని పరిశోధనా బృందం కనుగొంది. అంటే మరో గంట ఆరు నిమిషాల తరువాత, మూడు వంతులు వైరస్ కణాలు తప్పనిసరిగా క్రియారహితం అవుతాయి. కాని 25శాతం అప్పటికీ ఆచరణీయంగా ఉంటాయని గుర్తించారు. స్టెయిన్‌ లెస్ స్టీల్‌పై, సగం వైరస్ కణాలు క్రియారహితంగా మారడానికి 5 గంటల 38 నిమిషాలు పడుతుంది. అదే ప్లాస్టిక్‌పై 6 గంటల 49 నిమిషాలు పడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కార్డ్ బోర్డు విషయానికి వస్తే సుమారు మూడున్నర గంటల సమయం పడుతుంది. కాపర్(రాగి) విషయానికి వస్తే అతి తక్కువ సేపు వైరస్ మనుగడ సమయం ఉంది. సగం వైరస్ కణాలు రాగిపై 46 నిమిషాల్లో క్రియారహితం అయినట్టు గుర్తించారు.

కరోనా వైరస్ గాల్లో, బయటి ఉపరితలాలపై ఎంత సేపు మనుగడ సాగించగలదన్న దానిపై మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటివరకు మన జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష అంటున్నారు. వ్యక్తుల మధ్య కనీస దూరం పాటించడం, గుంపులుగా గుమిగూడకపోవడం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, కళ్లు, చెవులు, ముక్కును తాకకుండా ఉండటం తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.