Russia Covid-19 : 24గంటల్లో వెయ్యి కరోనా మరణాలు.. రష్యాలో మళ్లీ కోవిడ్ విలయానికి కారణం అదే

రష్యాలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆ దేశంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో వెయ్యి కోవిడ్ మరణాలు నమోదు కావడం..

Russia Covid-19 : 24గంటల్లో వెయ్యి కరోనా మరణాలు.. రష్యాలో మళ్లీ కోవిడ్ విలయానికి కారణం అదే

Russia Covid 19

Russia Covid 19: రష్యాలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆ దేశంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో వెయ్యి కోవిడ్ మరణాలు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో ఇంత భారీగా మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. గత వారం రోజులుగా కరోనా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. రష్యాలో మళ్లీ కరోనా విజృంభణకు కారణం ఏంటి? కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో ఎందుకు పెరిగాయి? అంటే.. దీనికి ముఖ్య కారణం రష్యన్‌ ప్రజలు టీకాలు తీసుకోకపోవడమే అని ప్రభుత్వం ఆరోపిస్తోంది.

మానవాళి మనుగడను సవాల్ చేస్తున్న కరోనావైరస్ మహమ్మారిపై విజయం సాధించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నిపుణులు తేల్చారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి పౌరులందరికి టీకాలు ఇస్తున్నాయి. అదీ ఉచితంగానే. వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరిస్తూ టీకా తీసుకోవడం ఎంత అవసరమో చెబుతున్నాయి. దీంతో ప్రజలు టీకాలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. దాంతో చాలా దేశాల్లో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు సక్సెస్ అయ్యాయి.

Heart Attack : షుగర్ వ్యాధి మందులతో గుండెపోటు ముప్పు పొంచివుందా?..

అయితే, రష్యాలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. అక్కడి ప్రజలకు టీకాలపై అపనమ్మకంతో ఉన్నారు. ఈ కారణంగా రష్యా జనాభాలో మూడో వంతు మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. రష్యా 2.22 లక్షల కోవిడ్ మరణాలతో యూరప్‌లో అత్యధిక మరణాలు నమోదు చేసిన దేశంగా ఉంది. శనివారం మరో 33 వేల మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు కొనసాగించాల్సిన అవసరం ఉన్నందున కఠిన ఆంక్షలను విధించడం లేదని ప్రభుత్వం తెలిపింది. దీనికి బదులుగా టీకాపై ప్రజలు చూపుతున్న ఉదాసీనతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

“వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో, ప్రజలందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి” అని ప్రభుత్వ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ అన్నారు. “టీకాలు వేసుకోకపోవడం బాధ్యతారాహిత్యం లాంటిది. ఇది ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది” అని ఆయన చెప్పారు. ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలలేదని, పెరుగుతున్న రోగుల సంఖ్యను తట్టుకోగల శక్తి తమకు ఉందని ప్రభుత్వం చెబుతోంది.

రష్యాలో కోవిడ్ యాక్టివ్‌ కేసుల సంఖ్య దాదాపు 7.5 లక్షలుగా ఉంది. కరోనా ప్రారంభమైనప్పటి నుండి రష్యాలో నమోదైన అత్యధిక యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా ఇదే. మొత్తం మీద ఇప్పటివరకూ దేశంలో 80 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకటి, రెండు డోసుల టీకాలు తీసుకున్న రష్యన్ల సంఖ్య ఆశ్చర్యకరంగా దగ్గర దగ్గరగా ఉంది. రెండూ కలిపితే జనాభాలో దాదాపు మూడొంతుల మంది కంటే కొంచెం తక్కువ మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. దీన్ని బట్టి పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకాలు వేసుకోవడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన అభిప్రాయ సేకరణలో 50 శాతం కంటే ఎక్కువ మంది టీకా వేసుకోవడంపై ఆసక్తి చూపించడం లేదని తేలింది.

Pills : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?..దుష్పప్రభావాలు ఇవే..

వాస్తవానికి టీకాలను అభివృద్ధి చేయడంలో రష్యా ముందే ఉంది. స్పుత్నిక్ వీ టీకాని గతేడాది త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు మరో మూడు టీకాలను రష్యా ప్రభుత్వం ఆమోదించింది. కానీ, టీకాలు నమ్మదగినవని ప్రజలను ఒప్పించడంలో రష్యా విఫలమైనట్లు కనిపిస్తోంది. స్పుత్నిక్ వీ టీకాను ప్రపంచవ్యాప్తంగా విక్రయించడంలో రష్యా మరింత విజయాన్ని సాధించింది. ఈ టీకా ఇతర దేశాలకు త్వరగా అందుబాటులోకి వచ్చినప్పటికీ, సరఫరా చేయడంలో సమస్యలు తలెత్తాయి. కొన్ని దేశాలకు సకాలంలో టీకా డోసులు అందడం లేదు.