వామ్మో వైరస్.. పాతదా..? భారత్‌కు కొత్త కరోనా భయం

వామ్మో వైరస్.. పాతదా..? భారత్‌కు కొత్త కరోనా భయం

New Covid Strain Transmissible India : కరోనా కొత్త స్ట్రెయిన్ గడగడలాడిస్తోంది. కొత్త వైరస్ పేరు ఎత్తితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. బ్రిటన్‌లో రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవు తున్నాయి. ఇప్పుడు ఈ వైరస్ భారతదేశంలోకి ప్రవేశించింది. లండన్ నుంచి వచ్చిన 22 మందికి పాజిటివ్ గా కరోనా నిర్ధారణ అయింది. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కాస్తా ఊపిరిపీల్చుకుంటున్న భారత్‌కు కొత్త కరోనా భయం పట్టుకుంది. అయితే ఆ 22 మందికి సోకింది పాత కరోనా వైరస్ లేదా కొత్త రకం కరోనా వైరస్ అన్నది సందిగ్ధత నెలకొంది.

దానిపై నిర్ధారణ కోసం ఆయా రాష్ట్రాల్లో బాధితులను నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబరేటరీకి పంపారు. ఫలితాలు ఒకటి రెండు రోజులో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. లండన్ నుంచి ఎయిర్ ఇండియాలో ప్రయాణించిన ప్రయాణికుల్లో ఆరుగురు కోవిడ్ బాధితులుగా తేలారు.

వాస్తవానికి వారిలో ఐదుగురికి మాత్రమే పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరొకరు చెన్నైకి చేరుకున్నాక పరీక్ష చేయించుకోగా కరోనా బారినపడినట్టు నిర్ధారణ అయింది. సెప్టెంబర్ నుంచి కొత్త రకం వైరస్ బ్రిటన్‌లో ప్రబలినందున ఇప్పటికే అక్కడి నుంచి భారత్ వచ్చినవారు ఉండటంతో భయాందోళన నెలకొంది.

అగ్రరాజ్యంలోకి ఎంట్రీ
మరోవైపు.. అమెరికాలోనూ ఈ కరోనా కొత్త స్ట్రెయిన్‌ వ్యాపించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దేశంలోకి ఇప్పటికే కొత్త స్ట్రెయిన్ ప్రవేశించినట్లు భావించాలని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫాసీ అన్నారు. లండన్‌లో కరోనా కొత్త రకం దూకుడును చూస్తుంటే అది దేశంలోకి ఖచ్చితంగా ప్రవేశించి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటన్‌ నుంచి కొన్ని వేల మంది అమెరికాలో ప్రవేశించినందున ఇది దేశంలోకి రావడం పెద్ద విషయం కాదని ఫాసీ అభిప్రాయపడ్డారు.

అలాగే అమెరికా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ కూడా దేశంలోకి ఈ తరహా వైరస్‌ ప్రవేశించి ఉండొచ్చని…అయితే దాన్ని గుర్తించి ఉండకపోవచ్చని అభిప్రాయపడింది. అయితే ఇప్పటివరకూ దేశంలో అలాంటి స్ట్రెయిన్ భయటపడలేదన్నారు. ఇక..ఈ కరోనా కొత్త స్ట్రెయిన్‌ ప్రభావంతో భూటాన్‌లో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. భూటాన్‌ ప్రధాన మంత్రి కార్యాలయం ఈ విషయాన్ని వెల్లడించింది.