భర్తతో విడాకులు తీసుకుంది..ఆసియా బిలియనీర్ గా మారింది

  • Published By: venkaiahnaidu ,Published On : June 2, 2020 / 02:17 PM IST
భర్తతో విడాకులు తీసుకుంది..ఆసియా బిలియనీర్ గా మారింది

చైనాకు చెందిన ఓ మహిళ తన భర్తతో విడాకులు తీసుకోవడం ద్వారా బిలియనీర్ అయింది. ఆసియాలోనే అత్యంత ఖరీదైన బ్రేకప్ గా ఇది నిలిచింది. ఇప్పటివరకు అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (35 బిలియన్‌ డాలర్లు) ఇచ్చిన విడాకులే అత్యంత కాస్ట్‌లీగా రికార్డుల్లోకెక్కగా.. రెండోస్థానంలో అలెక్‌ వైల్డెన్‌స్టెయిన్‌ ( 3.8 బిలియన్‌ డాలర్లు) ఉన్నారు. వీరి తర్వాతి స్థానంలోకి చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన ఓ బిలియనీర్‌ వచ్చారు.

చైనాలోని షెన్‌జెన్‌కు చెందిన షెన్‌జెన్‌ కంగతాయ్‌ బయాలాజికల్‌ ప్రాడక్ట్స్ కంపెనీ యజమాని “డు వీమిన్‌”…తన భార్య యువాన్‌ లిపింగ్‌ (49) తో విడాకులు తీసుకోవాలనుకున్నాడు. దీంతో అందుకు భార్యకు భరణంగా కంపెనీలోని 161.3మిలియన్ షేర్లు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ షేర్ల మొత్తం విలువ 3.2 బిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో 24వేల కోట్ల ఖరీదైన విలువైన విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించాడు. 

షెన్‌జెన్‌లో నివసిస్తున్న కెనడా పౌరురాలైన యువాన్‌…మే-2011 నుంచి ఆగస్టు-2018 వరకు కంగతాయ్‌ బయాలాజికల్‌ ప్రాడక్ట్స్‌ కంపెనీకి డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఈవిడ బీజింగ్‌ మిన్‌హాయ్‌ బయోటెక్నాలజీ కంపెనీకి వైస్‌ జనరల్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.  బీజింగ్ లోని యూనివర్శిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకనామిక్స్ నుంచి యువాన్ బ్యాచిలర్ డిగ్రీ పొందారు.

గడిచిన ఏడాదిగా కంగతాయ్ కంపెనీ షేర్లు రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టాయి. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ తయారీలో ఉన్నట్టు ఫిబ్రవరిలో  ప్రకటించడంతో ఈ సంస్థ షేర్లు అమాంతం పెరిగాయి. అయితే, విడాకుల వార్త బయటికి రావడంతో గత రెండు రోజులుగా నష్టాలను చవిచూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. విడాకుల నిర్ణయానికి ముందుకు డు వీమిన్‌ షేర్లు 6.5 బిలియన్‌ డాలర్ల నుంచి 3.1 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. 

చైనాలోని జింగ్జి ఫ్రావిన్స్ లోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన డు వీమిన్‌(56).. అంచెలంచెలుగా ఎదిగి 2004లో కంగతాయ్‌ సంస్థ చైర్మన్‌ స్థాయికి ఎదిగారు. కంగతాయ్ కంపెనీ మార్కెట్ విలువ 12.9బిలియన్ డాలర్లుగా ఉంది.