ముఖేష్ అంబానీ భార్య నీతాకు అమెరికాలో అరుదైన గౌరవం

  • Edited By: vamsi , November 13, 2019 / 08:54 AM IST
ముఖేష్ అంబానీ భార్య నీతాకు అమెరికాలో అరుదైన గౌరవం

దేశంలోనే అత్యంత ధనికుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ భార్య మహిళా వ్యాపారవేత్త, దాత అయిన నీతా అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో అతిపెద్ద మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ బోర్డుకు ఆమె ఎంపికయ్యారు. దేశంలోని కళలు, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది.

అత్యున్నత స్థాయి బోర్డు సమావేశంలో 57ఏళ్ల నీతా అంబానీని గౌరవ మెంబర్‌గా ఎన్నుకున్నట్లు మ్యూజియం ఛైర్మన్‌ డేనియల్‌ బ్రాడ్‌స్కీ ప్రకటించారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్తి నీతానే. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడంలో ఆమె చూపిస్తున్న చొరవ అసాధారణం అని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌ ఛైర్మన్ డానియల్ బ్రాడ్ స్కై ఈ సంధర్భంగా కొనియాడారు.

నీతా అంబానీ మద్దతుతో ప్రపంచం నలుమూలల ఉన్న కళల గురించే అధ్యయనం చేసే సామర్థ్యం మ్యూజియంకు లభించిందని, ఆమెకు కళల పట్ల నిబద్ధత అసాధారణమైనదని ఆయన ప్రశంసించారు. 149ఏళ్ల పురాతన మెట్రోపాలిటన్ మ్యూజియంగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా 5,000 సంవత్సరాల నుండి విస్తరించి ఉన్న కళలను ఇందులో ప్రదర్శించి ఉన్నారు. ప్రతి సంవత్సరం దీనిని చూడటానికి బిలియనీర్లు, ప్రముఖులు మరియు మిలియన్ల మంది సందర్శకులుగా వస్తుంటారు.

నీతా అంబానీ సేవా కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం, సంస్కృతి, కళలు, క్రీడాభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీలో పనిచేసిన తొలి భారతీయ మహిళగా కూడా ఆమెకు గుర్తింపు ఉంది. క్రీడారంగంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ చేసిన కృషికి 2017లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె ‘ఖేల్‌ ప్రోత్సాహన్‌’ అవార్డు అందుకున్నారు.