భారత్ ప్రతీకారం.. చైనా ఉత్పత్తులను బ్యాన్ చేసిన బీఎస్ఎన్ఎల్

  • Published By: vamsi ,Published On : June 18, 2020 / 01:40 AM IST
భారత్ ప్రతీకారం.. చైనా ఉత్పత్తులను బ్యాన్ చేసిన బీఎస్ఎన్ఎల్

సరిహద్దు వివాదంలో భారత్‌తో నెత్తుటి ఘర్షణకు దిగిన చైనాపై భారత్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందనేది భవిష్యత్ విషయమే. అయితే తక్షణమే చైనాతో ఆర్థిక లావాదేవీలను వదులుకునేందుకు భారత్ యోచిస్తుంది. ఈ క్రమంలోనే టెలికాం మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్ ముందడుగు వేసింది. బిఎస్ఎన్ఎల్ 4జీ అప్ గ్రేడ్ సేవలకు చైనా వస్తువులను వినియోగించకూడదని నిర్ణయం తీసుకుంది.

దేశంలో చైనా  ఉత్పత్తులను బ్యాన్ చేయాలని, చైనా యాప్స్‌ను నిషేదించాలనే డిమాండ్ పెరగడంతో..  ఇప్పటికే అనేకమంది మొబైల్ ఫోన్లలో చైనీస్ యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల చైనా ఉత్పత్తులను పగలగొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే బిఎస్ఎన్ఎల్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోగా.. ఇదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా నడిచే అవకాశం కనిపిస్తోంది.  

‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు తమ కొనుగోళ్లను పరిమితం చేయాలని భారత టెలికాం మంత్రిత్వ శాఖ తన పరిధిలోని అన్ని సంస్థలను ఆదేశించింది. టెలికాం మంత్రిత్వ శాఖ బిఎస్ఎన్ఎల్, ఎంటిఎన్ఎల్ మరియు ఇతర అనుబంధ సంస్థలను అప్‌గ్రేడేషన్‌లో చైనా పరికరాలను వాడవద్దని కోరింది.

అంతేకాకుండా మోడీ కలల ప్రాజెక్ట్.. “ఆత్మనీర్భర్ భారత్” కోసం కేంద్రం ముందుకు రావడంలో భాగంగా భారతదేశంలో తయారైన వస్తువుల కొనుగోలును తమ ప్రథమ ప్రాధాన్యతగా చేసుకోవాలని సంబంధిత శాఖలన్నింటినీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. టెలికాం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం దాని అనుబంధ సంస్థల 4 జి అప్‌గ్రేడేషన్ కొనుగోళ్లలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Read: ఆ 52 చైనా యాప్స్ ను నిషేధించండి’..ఇంటెలిజెన్స్ వర్గాల సూచన