మేము ఏమైనా బతిమాలామా : భారత్‌తో మాటల్లేవన్న ఇమ్రాన్

  • Published By: venkaiahnaidu ,Published On : August 22, 2019 / 01:41 PM IST
మేము ఏమైనా బతిమాలామా : భారత్‌తో మాటల్లేవన్న ఇమ్రాన్

భారత్‌తో చర్చలకు తాను ఏ మాత్రం సిద్ధంగా లేనని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఫోన్ లో మాట్లాడిన మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియా ముందు తన అసహనం వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోడీ చర్చలకు ఆహ్వానించిన ప్రతీ సందర్భంలో తమ సైన్యాన్ని దెబ్బ తీస్తున్నారని ట్రంప్‌ కి ఇమ్రాన్ ఖాన్ కంప్లెయింట్ చేశారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దుపై కూడా మోడీ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ట్రంప్ కి ఇమ్రాన్ కంప్లెయింట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కశ్మీర్ ఇష్యూని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ట్రంప్ ఇమ్రాన్ ఖాన్ కు సూచించిన మరుసటి రోజే ఇమ్రాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
 
న్యూయార్క్ టైమ్స్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ మాట్లాడుతూ.. తాను శాంతి గురించి చర్చలు జరిపేందుకు ప్రయత్నించిన ప్రతిసారి.. భారత్ కేవలం బుజ్జగింపులాగానే భావిస్తోందని.. ఇంతకు మించి తాము ఏమీ చేయలేమని చెప్పారు. అణ్వాస్త్ర బలం ఉన్న తమ ఇరు దేశాల మధ్యా రోజురోజుకూ పెరుగుతున్న యుద్ధ వాతావరణంపై ఆందోళన చెందుతున్నట్లు ఇమ్రాన్ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుపై స్పందిస్తూ.. ఈ విషయంలో భారత్ తో తాడోపేడో తేల్చుకుంటామని.. అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లి మరింత బలంగా తమ వాదన వినిపిస్తామని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.  ]

పాక్ పాడుతున్న పాటకు చైనా మద్దతు ఉండటంతో గత వారం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్(UNSC)లో కశ్మీర్ విషయంపై రహస్య సమావేశం జరిగిన విషయం తెలిసిందే. అయితే కశ్మీర్ విషయంలో భారత్ క్లారిటీగా ఉంది. ఆర్టికల్ 370రద్దు భారత్ అంతర్గత వ్యవహారమని,ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని సృష్టం చేసింది.