అమెరికాని వణికిస్తున్నాడు : కొత్త ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తరకొరియా

  • Published By: venkaiahnaidu ,Published On : April 18, 2019 / 02:33 PM IST
అమెరికాని వణికిస్తున్నాడు : కొత్త ఆయుధాన్ని పరీక్షించిన ఉత్తరకొరియా

అణ్వాముధ పరీక్షలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా ఇప్పుడు మరో కొత్త తరహా ఆయుధాన్ని పరీక్షించింది. టాక్టిక‌ల్ గైడెడ్ వెప‌న్‌ గా దీన్నిపిలుస్తారు.బుధవారం(ఏప్రిల్-17,2019)ఈ టాక్టిక‌ల్ గైడెడ్ వెప‌న్‌ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించినట్లు ఆ దేశానికి చెందిన అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(KCNA) గురువారం(ఏప్రిల్-18,2019) ప్రకటించింది.అయితే ఓ శ‌క్తివంత‌మైన అణ్వాయుధాన్ని కూడా ఆ వెప‌న్‌ తో ప‌రీక్షించిన‌ట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ల మధ్య రెండుసార్లు జరిగిన చర్చల్లో ఏ ఒప్పందం లేకుండా ముగిసిన తర్వాత ఇలాంటి పరీక్ష జరగడం ఇదే మొదటిసారి.

 ఈ పరీక్షపై KCNA కొన్ని వివరాలు విడుదల చేసింది.టాక్టిక‌ల్ వెప‌న్‌ ను యుద్ధ స‌మ‌యంలో వాడుతార‌ని, అదేమీ సుదీర్ఘ దూరం ప్ర‌యాణించే మిస్సైల్ కాద‌ని తెలిపింది.వివిధ లక్ష్యాలపై రకరకాల పద్ధతుల్లో ఫైరింగ్ చేస్తూ ఈ పరీక్షలు నిర్వహించామని కేసీఎన్ఏ చెప్పింది. అంటే ఇది భూమి, నీళ్లు, గాలిలో ప్రయోగించగలిగే ఆయుధం అయ్యుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.కిమ్ పర్యవేక్షణలోనే ఈ టెస్ట్ జరిగినట్లు కేసీఎన్ఏ తెలిపింది.ప‌రీక్షించిన ఆ ఆయుధ సామ‌ర్థ్యాన్ని కిమ్ కొనియాడిన‌ట్లు తెలిపింది. ఇలాంటి ఆయుధ వ్య‌వ‌స్థ‌ను త‌యారు చేయ‌డం చ‌రిత్రాత్మ‌కం అని, ఈ కొత్త త‌ర‌హా ఆయుధంతో త‌మ సైన్యం మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్లు కిమ్ అన్నట్లు కేసీఎన్ఏ తెలిపింది.

అణునిరాయుధీకరణపై చర్చించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో డోనల్డ్ ట్రంప్, కిమ్…వియత్నాం రాజధాని హనోయ్‌ లోని ఓ హోటల్ లో సమావేశమయ్యారు.రెండు రోజులు వీరి ద్దరి మధ్య సమావేశం జరగాల్సి ఉండగా తొలి రోజునే చర్చలు విఫలమై ఇద్దరు నేతలూ అర్థంతరంగా వెళ్లిపోయారు.పూర్తిగా అణ్వాయుధ పరీక్షలు ఆపేయాలని ఈ భేటీ సందర్భంగా ట్రంప్ కోరగా దానికి కిమ్ అంగీకరించాడని,అయితే బదులుగా తమ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కిమ్ కోరాడని,దీనికి ట్రంప్ అంగీకరించలేదని వార్తలు వచ్చాయి.ఈ కారణంగానే చర్చలు ఒక్క రోజులోనే విఫలమై ఇద్దరు నేతలు తమ తమ దేశాలకు వెనుదిరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.