మరో టైటానిక్ ప్రమాదం…తృటిలో తప్పింది

  • Published By: venkaiahnaidu ,Published On : March 24, 2019 / 12:39 PM IST
మరో టైటానిక్ ప్రమాదం…తృటిలో తప్పింది

 నార్వేలో 1300 మందితో ప్రయాణిస్తున్న ఓ షిప్ ఇంజిన్‌ లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో పాటు ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో నిలిచిపోయింది.భీకరమైన గాలులతో అలల ఉద్ధృతి పెరగడంతో ఎంవీ వైకింగ్ స్కై నౌక నుంచి తమకు అత్యవసర సహాయం కోసం సమాచారం పంపించిందని నార్వే సముద్ర ప్రమాదాల రక్షణ ఏజెన్సీ తెలిపింది.ప్రస్తుతం నౌక సముద్రతీరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉందని సహాయక చర్యలు చేపట్టామని నార్వే విపత్తు నివారణా దళ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ప్రయాణికులను హెలికాఫ్టర్ల ద్వారా రక్షిస్తున్నామని నార్వే పోలీస్‌ చీఫ్‌ టోర్‌ఎండ్రీ ఫ్రాంక్‌ తెలిపారు. గాలులు బలంగా వీస్తున్నందున సముద్రమార్గంలో నౌకను సమీపించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. నాలుగు హెలికాఫ్టర్ల సాయంతో ఇప్పటివరకు  479మందిని రక్షించామని తెలిపారు.

జాన్ కర్రీ అనే ప్రయాణికుడు మాట్లాడుతూ…నౌక భయంకరంగా ఊగిపోవడం మొదలైనప్పుడు మేం లంచ్ చేస్తున్నాం. కిటికీల అద్దాలు పగిలిపోయాయి. నీళ్ళు లోపలికి వచ్చాయి. అంతా భయంతో కేకలు వేశారు.ఈ హెలికాప్టర్ ప్రయాణం నా జీవితంలో మరిచిపోలేను అని ఆయన అన్నారు.

ఎవీ వైకింగ్ స్కై నౌకలోని ప్రయాణికులకు సహాయం అందించడానికి పడవలో అక్కడికి చేరుకున్న జాలరి జాన్ ఎరిక్ ఫిస్కర్‌స్ట్రాండ్ మాట్లాడుతూ…రెండు మూడు నిమిషాలు ఆలస్యం జరిగితే చాలా దారుణం జరిగి ఉండేది” అని చెప్పారు.ఇంజన్‌ను మళ్ళీ స్టార్ట్ చేసి, లంగర్ వేసి ఉండకపోతే ఆ నౌక రాళ్ళను డీకొనేదని జాన్ చెప్పారు.