కరోనా వ్యాక్సిన్, చైనా వద్దు.. భారత్‌ ముద్దంటున్న నేపాల్‌

కరోనా వ్యాక్సిన్, చైనా వద్దు.. భారత్‌ ముద్దంటున్న నేపాల్‌

indian vaccine first : మొన్నటివరకు చైనాకు వంత పాడిన నేపాల్‌.. ప్రస్తుతం షాకుల మీద షాకులిస్తోంది. తాజాగా క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ విష‌యంలోనూ చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్‌కు నో చెప్పింది. ఇండియాలో త‌యార‌య్యే వ్యాక్సిన్‌లే తీసుకుంటామ‌ని డ్రాగన్‌ కంట్రీకి స్పష్టం చేసింది. ఈ నెల 14న ఆ దేశ విదేశాంగ మంత్రి ప్రదీప్ గ్యావాలీ ఇండియాలో ప‌ర్యటించ‌నున్న నేప‌థ్యంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప‌ర్యట‌న‌లో భాగంగా భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తో ప్రదీప్ స‌మావేశం కానున్నారు. ఇందులోనే నేపాల్‌కు కోటీ 20 ల‌క్షల డోసుల వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయాల్సిందిగా ప్రదీప్ కోర‌నున్నారు.

ప్రస్తుతం ఆ దేశ ప్రధానిగా ఉన్న కేపీ శ‌ర్మ ఓలీ.. మొద‌ట్లో చైనాకు అనుకూలంగా వ్యవ‌హ‌రించారు. ఇండియాతో క‌య్యానికి కాలు దువ్వారు. అయితే ఆ త‌ర్వాత క్రమంగా ఆయ‌న వైఖ‌రిలో మార్పు క‌నిపించింది. సొంత నేపాల్ క‌మ్యూనిస్ట్ పార్టీలోనే త‌న‌కు వ్యతిరేక వ‌ర్గం ఏర్పాటు కావ‌డం, వారికి చెక్ పెట్టడానికి ఏకంగా పార్ల‌మెంట్‌నే ర‌ద్దు చేయ‌డంలాంటి చ‌ర్యలు చైనాకు మింగుడు ప‌డ‌లేదు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ పార్టీ చీల‌కుండా చూడ‌టానికి చైనా ప్రత్యేకంగా న‌లుగురు స‌భ్యుల బృందాన్ని కూడా నేపాల్ పంపించింది. అయినా ప్రయోజ‌నం లేక‌పోయింది.

క‌రోనా వ్యాక్సిన్ విష‌యంలోనూ చైనా ఆఫ‌ర్‌ను నేపాల్ తిర‌స్కరించింది. భార‌త అధికారుల‌తో చ‌ర్చల సంద‌ర్భంగా తాము సినోవాక్ వ్యాక్సిన్‌ను తిర‌స్కరించామ‌ని, ఇండియా నుంచే వ్యాక్సిన్ తీసుకోవడానికి ఓలీ ప్రభుత్వం మొగ్గు చూపుతోంద‌ని నేపాల్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యాక్సిన్ కోసం ఇండియాలోని త‌యారీదారుల‌తో నేపాల్ రాయ‌బారి నీలాంబ‌ర్ ఆచార్య చ‌ర్చలు జ‌రిపారు.