నిన్నటిదాకా ఎస్‌ ప్రెసిడెంట్‌.. నేడు నో ట్రంప్‌

  • Published By: madhu ,Published On : November 7, 2020 / 01:52 PM IST
నిన్నటిదాకా ఎస్‌ ప్రెసిడెంట్‌.. నేడు నో ట్రంప్‌

Not supporting Trump : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అనే సామెత ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సరిగ్గా సరిపోతుంది. అగ్రరాజ్యపు అధినేతగా ఇన్నాళ్లు అమెరికా, ప్రపంచంపై పెత్తనం చెలాయించిన ట్రంప్‌ నేడు ఒంటరివారయ్యారు. ఎన్నికల్లో ఓటమి ఇంకా నిర్థారణ కాకముందే ఆయన్ను పట్టించుకునేవారే లేకపోయారు. నిన్నటిదాకా ఆయన్ను అంటిపెట్టుకుని తిరిగిన వారు ఇప్పుడు దూరం అవుతున్నారు. ఆయన ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురుచూసిన వారంతా ఇప్పుడు మధ్యలోనే మైక్‌లు కట్‌ చేస్తున్నారు. అధికారం పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ట్రంప్‌కు చూపిస్తున్నారు. ప్రతిపక్షాలే కాదు ఇన్నాళ్లూ తమలో అణిచిపెట్టుకున్న ఆగ్రహాన్ని రిపబ్లికన్లు మెల్లమెల్లగా వెళ్లగక్కుతున్నారు.




అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. కాసేపట్లో మాజీ అధ్యక్షుడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఎన్నికల కౌంటింగ్‌ను చూస్తుంటే ట్రంప్‌ను ఓటమి వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది.. గంట గంటకు మారుతున్న ఫలితాల ట్రెండ్‌.. ఆయన వైట్‌ హౌస్‌ను వీడటం కన్‌ఫామ్‌ చేస్తున్నాయి.. దాదాపు ప్రపంచం మొత్తం బైడెనే ఇక అగ్రరాజ్యపు అధినేత అని దాదాపుగా ఒక అంచనాకు వచ్చేశాయి. అతను ఇంకా మాజీ కాకముందే.. అమెరికాలోని కొన్ని వర్గాల నుంచి ట్రంప్‌కు ఎదురుపవనాలు వీస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన ఒంటరిగా మారారా?.. ఆయన పోరాటం.. ఒంటరి పోరాటమేనా?




2016లో అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ట్రంప్‌ చాలా దూకుడుగా వ్యవహరించారనే చెప్పాలి. పలు వార్త సంస్థలను లక్ష్యంగా చేసుకొని ఆయన బహిరంగంగానే విమర్శలు చేసేవారు. తనకు నచ్చని వారిని టార్గెట్‌ చేస్తూ ట్వీట్‌లు పెడుతూ ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో చీల్చి చెండాడే వారు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకు వెళ్లారే కానీ.. ఎవరికి ఏనాడు సమాధానం ఇవ్వలేదు.. వెనక్కి తగ్గలేదు.
https://10tv.in/secret-service-security-for-biden/



అలా ఇన్నాళ్ల పాటు దూకుడుగా వ్యవహరించిన ట్రంప్‌ పరిస్థితి.. కౌంటింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి అంటే కేవలం మూడు రోజుల్లోనే పూర్తిగా మారిపోయింది. పార్టీలో ఆయన నేడు ఒంటరిగా మారారు. బయట కూడా ఇప్పుడు ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడే వారు కరువైన పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేని మద్దతు, నేడు ఆయనకు అవసరమైంది. కానీ ఎవరూ ముందుకొచ్చి ట్రంప్‌కు అండగా నిలుస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.




ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ట్రంప్‌ మొదటి నుంచి ఆరోపిస్తున్నారు.. బైడెన్‌ ఆధిక్యంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఆయన బృందం కోర్టులో దావాలు వేస్తూ న్యాయపోరాటానికి దిగుతుంది. కానీ రిపబ్లిక్‌ పార్టీ నుంచి ఒక్క నేత కూడా ట్రంప్‌కు మద్దతు పలకడం లేదు. అసలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడే వారే కనిపించడం లేదు. దీనిపై ట్రంప్‌ ఒక్కరే పదే పదే ట్వీట్‌లు చేస్తూ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.. పార్టీలో కీలక నేతగా ఉన్న నిక్కీ హెలీ, ఇతర నేతలు ఈ అంశంపై పెదవి విప్పలేదు..




దీంతో ట్రంప్‌ కుటుంబం ఉడికిపోతుంది.. దీనిపై బహిరంగంగానే విమర్శలకు దిగారు ట్రంప్‌ జూనియర్‌. 2024 ఎన్నికల్లో అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్న కొందరు రిపబ్లిక్‌లు.. ప్రస్తుతం ట్రంప్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా ఉన్నారంటూ ట్రంప్‌ జూనియర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీంతో సొంత పార్టీలోనే ఆయనకు మద్దతు కరువైనట్టు బహిరంగంగానే అంగీకరించినట్టైంది. ఇదిలా ఉంటే ఎలాంటి రుజువులు లేకుండా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తే మద్దతు పలికేదేలా అంటూ రిపబ్లికన్‌లు చర్చించుకుంటున్నారు.




ఇక బయటి వైపు నుంచి ట్రంప్‌కు పెద్దగా మద్దతు లభిస్తున్నట్టు కనిపించడం లేదు. కౌంటింగ్‌ ఆపాలంటూ మిషిగన్‌, జార్జియా, పెన్సిల్వెనియా రాష్ట్రాల్లో ట్రంప్‌ బృందం వేసిన దావాలకు చుక్కెదురైంది. ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్న అధ్యక్షుడు ట్రంప్‌కు అక్కడి న్యూస్‌ ఛానల్స్‌ కూడా షాక్ ఇస్తున్నాయి.. ఆయన ప్రసంగిస్తుండగానే మైక్‌లు కట్‌ చేస్తున్నాయి.. ఓట్ల లెక్కింపులో తీవ్ర మోసం జరుగుతుందంటూ వైట్‌ హౌస్‌లో ఆయన మరోసారి ప్రెస్‌ మీట్‌ పెట్టారు. కానీ ABC, CBS, NBC న్యూస్‌ చానల్స్‌ను లైవ్‌ను కట్‌ చేశాయి. ఆధారాలు లేకుండా ఎన్నిసార్లు ఒకే విషయాన్ని ఆరోపిస్తారు? అన్న కోణంలో లైవ్‌ తీసేశామని ఛానల్స్‌ చెబుతున్నా.. గతంలో ట్రంప్‌ మీడియాపై చేసిన ఘాటు విమర్శల తాలుకూ ఎఫెక్ట్‌ కూడా ఉండకపోదనేది విమర్శకుల మాట..