ఆందోళన వద్దు.. నేనూ వ్యాక్సిన్ వేయించుకున్నా.. బైడెన్

ఆందోళన వద్దు.. నేనూ వ్యాక్సిన్ వేయించుకున్నా.. బైడెన్

Joe Biden Vaccine Live On Television : అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ కరోనా టీకా వేయించుకున్నారు. డెలవర్‌లోని క్రిస్టియానా ఆస్పత్రిలో జో బైడెన్‌ (78) ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్నారు. బైడెన్‌ వ్యాక్సినేషన్ వేయించుకోవడాన్ని టెలివిజన్లలో లైవ్ టెలిక్యాస్ట్ చేశారు. వ్యాక్సిన్ సురక్షితంపై ఆందోళన చెందుతున్న ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బైడెన్ తొలి డోస్ వేయించుకున్నారు. ‘టీకా విషయంలో ఎవరూ ఆందోళన పడొద్దు.

ప్రజల్లో అపోహను తొలగించేందుకే నేనూ టీకా వేసుకుంటున్నానని బైడెన్‌ అన్నారు. టీకా వేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మొదటి టీకా డోస్ వేయించుకున్నా.. రెండో కోసం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నానని బైడెన్‌ చెప్పారు. బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆమె కూడా ముందు రోజే టీకా వేయించుకున్నారు.

వ్యాక్సిన్‌ల సమర్థతపై ప్రజల్లో భయాందోళన నెలకొందని, టీకా చాలా సురక్షితమనే విషయం ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని బైడెన్ చెప్పారు. బహిరంగంగానే తాను టీకా తీసుకునేందుకు రెడీగా ఉన్నానని ప్రకటించారు. ప్రజల్లో అపోహలను తొలగించడానికి బైడెన్‌ టీకా తీసుకుంటున్న కార్యక్రమాన్ని అమెరికా ఛానళ్లు లైవ్ టెలిక్యాస్ట్ చేశాయి.

ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషద నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అనుమతి లభించిన నేపథ్యంలో టీకా కార్యక్రమం మొదలైంది. గత వారం నుంచే అమెరికాలో పెద్దఎత్తున కరోనా టీకాను ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు అమెరికాలో సుమారు మూడు లక్షల 20 వేల మంది చనిపోయారు. క్రిస్మస్‌ సెలవుల నేపథ్యంలో ప్రజలంతా ఒక్కచోట చేరే అవకాశం ఉండడంతో మాస్క్‌లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని జోబైడెన్‌ మరోసారి అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు.