కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.. మూర్ఛబోయి కంగారు పెట్టేసింది, వీడియో వైరల్!

కరోనా వ్యాక్సిన్ తీసుకుంది.. మూర్ఛబోయి కంగారు పెట్టేసింది, వీడియో వైరల్!

కరోనా కాటు నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం విడుదలవుతూ ఉంది. ఎంతోకాలం పాటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసి, కోట్లమందిని బాధపెట్టి, లక్షలాది మంది ప్రాణాలను హరించిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేసింది. కొన్నిదేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్‌లను అత్యవసర సేవల్లో భాగంగా ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే అమెరికాలోని ఒక ఆసుపత్రిలో నర్సు మేనేజర్‌‍కు కరోనా టీకా ఇవ్వగా.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత విలేకరుల సమావేశంలోటిఫనీ డోవర్ అనే నర్సు మూర్ఛపోవడం కలకలం రేపింది. ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ షాట్ తీసుకున్న తరువాత, టిఫనీ డోవర్ లైవ్ కెమెరా ముందే కుప్పకూలిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

అమెరికా నగరమైన టేనస్సీలోని సిహెచ్‌ఐ మెమోరియల్ హాస్పిటల్ నుండి టిఫనీ డోవర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ.. విలేకరుల ప్రశ్నలకు సమాధానం ఇస్తుండగా.. మధ్యలోనే కొంచెం మైకంతో పడిపోయారు. ఈ టీకా గురించి మా మొత్తం సిబ్బంది ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆమె వీడియోలో చెప్పారు. మేము కోవిడ్ యూనిట్, కాబట్టి నా టీమ్‌కు మొదట ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించుకునే అవకాశం వచ్చిందని ఆమె అన్నారు.

దీని తరువాత, ఆమె ఈ వీడియోలో కొంచెం అసౌకర్యంగా కనిపించింది. ఇదే సమయంలో నేను మైకముగా ఉన్నానని చెబుతూనే.. తన సమతుల్యతను కోల్పోయి మూర్ఛపోయింది. వెంటనే డాక్టర్లు ఆమెను పరీక్షించగా.. వ్యాక్సిన్ కారణంగా కొంత అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితి ఉంటుందని, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 17 నిమిషాల తరువాత టిఫనీ మూర్ఛపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు.

ఈ మూర్ఛ, నొప్పి లేదా జలదరింపు వల్ల వచ్చి ఉండొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. వ్యాక్సిన్ ఇచ్చిన గంట వరకు అందుకే పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.