Alibaba : ఏడాది క్రితం నోరు జారిన జాక్ మా..ఫలితం రూ.25 లక్షల కోట్ల నష్టం

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా నోరుజారి చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఆయన 344 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంటే భారత కరెన్సీలో 25 లక్షల కోట్లకు పైమాటే.

Alibaba : ఏడాది క్రితం నోరు జారిన జాక్ మా..ఫలితం రూ.25 లక్షల కోట్ల నష్టం

Alibaba

Alibaba  ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా నోరుజారి చేసిన అనాలోచిత వ్యాఖ్యల వల్ల ఆయన 344 బిలియన్ డాలర్లు నష్టపోయారు. అంటే భారత కరెన్సీలో 25 లక్షల కోట్లకు పైమాటే. ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాటల్లో జాక్‌మా మాటను కూడా రాసిపెట్టుకోవాల్సిందే.

2020 అక్టోబరు 24న చైనాలో ‘ది బండ్ సమిట్‌’ పేరుతో జరిగిన సదస్సులో పాల్గొన్న జాక్ మా..చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించారు. చైనాలో సచేతనమైన ఆర్థిక విధానాలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి రోగికి తప్పుడు ఔషధాలు ఇచ్చినట్లే పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. సంప్రదాయబద్ధంగా వస్తున్న ఆర్థిక విధానాల్లో సమూల మార్పులు అవసరమని, విస్తృత ఆలోచనలు అభివృద్ధి చేసుకోవాలంటూ జాక్ మా ప్రసంగించారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు.

జాక్‌మా చేసిన ఈ సూచనలు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మనసును గాయపరిచాయి. వెంటనే రంగంలోకి దిగిన ప్రభుత్వం జాక్‌మా వ్యాపారంపై తీవ్రమైన దెబ్బకొట్టింది. జాక్‌మా వ్యాపారంపై నిఘా పెట్టి ఆయన స్థాపించిన యాంట్ గ్రూప్‌ను ఐపీవోకు వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో అలీబాబా షేర్లు స్టాక్ మార్కెట్లో పతనమవుతూ వచ్చాయి. ఒక్క అలీబాబానే కాదు దాని అనుబంధ సంస్థల షేర్లు కూడా భారీగానే పతనమయ్యాయి.

ఏడాది కాలంలోనే అలీబాబా తన మార్కెట్‌ విలువలో 344 బిలియన్‌ డాలర్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ విలువ కూడా ఒక ఏడాదిలో ఈ స్థాయిలో కరగిపోలేదు. చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ అత్యంత నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని, ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోలేదని అనేక విమర్శలు ఉన్నాయి. జాక్‌మాపై ప్రభుత్వ చర్యల పట్ల కూడా జిన్‌పింగ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే జిన్‌పింగ్ సర్కార్ వీటిని లెక్క చేయలేదు.

ALSO READ Facebook Influencing Polls : దేశ ఎన్నికల్లో ఫేస్ బుక్ జోక్యంపై జేఏపీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్