రేపటి నుంచి విదేశీ విమాన సేవలు…ఆ మూడు దేశాలకు అనుమతి

  • Published By: bheemraj ,Published On : July 16, 2020 / 09:49 PM IST
రేపటి నుంచి విదేశీ విమాన సేవలు…ఆ మూడు దేశాలకు అనుమతి

కరోనా ఎఫెక్ట్ తో (మార్చి 23, 2020) నుంచి నిలిచిపోయిన విదేశీ విమాన సేవలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రేపటి నుంచి విదేశీ విమాన సేవలు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ముందుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాల విమాన సేవలకు అనుమతిచ్చామని తెలిపారు. శుక్రవారం (జులై 17, 2020) నుంచి (జులై 31, 2020) వరకు భారత్, అమెరికా మధ్య 18 యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానాలు నడిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.

రేపటి నుంచి మొదటగా మూడు దేశాలతో ఈ విమాన సేవలు ప్రారంభించబోతున్నట్లు హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇవాళ నిర్వహించిన సమావేశంలో ఇప్పటివరకు విమానయాన రంగం ద్వారా ఎంతమంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు.. ఎంత మంది విదేశీయులను వారి వారి స్వస్థాలకు పంపారన్న వివరాలతోపాటుగా భవిష్యత్ విమాన రంగం సేవలకు సంబంధించిన అంశాలను మీడియా ముందు ఉంచారు.

అందులో భాగంగానే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు సంబంధించిన విమాన సంస్థలతో కొన్ని ఒప్పందాలు జరుపుకున్నట్లుగా వెల్లడించారు. రేపటి నుంచి అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు సహా ఆ దేశానికి సంబంధించిన విమానాలు ముఖ్యంగా యునైటెడ్ ఎయిర్ లైన్స్ ముఖ్యంగా 18 విమానాలను రేపటి నుంచి జులై 31 వరకు నడపనన్నట్లు తెలిపారు. ఈ విమాన సేవలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు మధ్య నడుపబోతున్నారు.

అలాగే జులై 19 నుంచి ఎయిర్ ఫ్రాన్స్ విమానయాన సంస్థ… ఢిల్లీ, ముంబై, బెంగళూరుకు 25 విమానాలను నడపనుంది. జర్మనీతో కూడా చర్చలు ఫైనల్ స్టేజీలో ఉన్నాయి. జర్మనీ లుక్సానా ఎయిర్ లైన్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఎయిర్ లైన్స్ కూడా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లకు విమానాలను నడపనుంది.

అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో విదేశీ విమాన సర్వీసులపైన సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పాజిటివ్ లేని వారికి, వారి హెల్త్ చెక్ అప్ చేసిన తర్వాత మాత్రమే ప్రయాణాలకు అనుమతించనున్నట్లు తెలిపారు. వందేభారత్ మిషన్ లో భాగంగా 2 లక్షల 8 వేల భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లుగా వెల్లడించారు. అలాగే 85 వేల 289 మందిని ఆయా దేశాలకు పంపించినట్లు పౌర విమానయాన శాఖ వెల్లడించింది.

కరోనా ఎఫెక్ట్ సమయంలో ఎయిర్ ఇండియా జులై 13 వరకు కూడా 1103 విమానాలను నడిపినట్లుగా మంత్రి పేర్కొన్నారు. రేపటి నుంచి మన దేశం నుంచి అమెరికాకు, ఆ దేశం నుంచి మన దేశానికి విమాన సేవలను కొనసాగించబోతుంది. కరోనా ఎఫెక్ట్ ఉధృతమైతే కనుక ఈ విమాన సేవలను నిలిపివేసే అవకాశం ఉన్నట్లు విమానయాన శాఖ వర్గాలు వెల్లడించాయి.