ఇమ్రాన్ ఖాన్ ను కలిసిన పాక్ ఛారిటీ గ్రూప్ హెడ్ కి కరోనా పాజిటివ్

  • Published By: venkaiahnaidu ,Published On : April 21, 2020 / 12:25 PM IST
ఇమ్రాన్ ఖాన్ ను కలిసిన పాక్ ఛారిటీ గ్రూప్ హెడ్ కి కరోనా పాజిటివ్

పాకిస్తాన్ లోనే అతిపెద్ద ఛారిటీ గ్రూప్ లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్ ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ రిలీఫ్ కింద 1కోటి రూపాయల చెక్ ఇచ్చేందుకు గత వారం ఫైజల్… ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ కు వచ్చి ఇమ్రాన్ కు చెక్ అందించారాయన. చెక్ ఇస్తూ ఇమ్రాన్ తో ఫొటో కూడా దిగారు.

ఫైజల్ ఈధీ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నారు. అయితే ఫైజల్ ఈధీకి దగ్గరిగా మెలిగిన వారందరికీ కరోనా టెస్ట్ లు జరుగుతాయని ఈధీ కుమారుడు సాద్ తెలిపారు. ఈధీ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పాక్‌లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఈధీ కరోనా బారిన పడ్డారని ఫౌండేషన్ తెలిపింది.

ఈధీకి కరోనా సోకిన నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాదు కొన్ని వారాల పాటు క్వారంటైన్ అవ్వాలని పాక్‌లో కోవిడ్ కేసులను పర్యవేక్షిస్తున్న డాక్టర్ ఫైసల్ సుల్తాన్ ఇమ్రాన్‌కు సూచించారు. అయితే టెస్ట్ చేయించుకోవాలా వద్దా అన్నదానిపై తుది నిర్ణయం ఇమ్రాన్ ఖాన్ దేనని ఆయన తెలిపారు.