కుల్ భూషణ్ ను కలిసిన భారత దౌత్యాధికారులు

  • Published By: madhu ,Published On : July 17, 2020 / 11:11 AM IST
కుల్ భూషణ్ ను కలిసిన భారత దౌత్యాధికారులు

కుల్ భూషణ్ కేసులో పాకిస్తాన్ చేస్తున్న ప్రచారం తూచ్ అని తేలిపోయింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పై కోర్టు (Islamaba High Court) లో సవాల్ చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ..పాక్ వెల్లడించింది. అయితే..గురువారం భారత దౌత్యాధికారులు జైలులో జాదవ్ ను కలిశారు.

ఈ మేరకు వారి నుంచి రిపోర్టు అందిందని విదేశాంగ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీ వాస్తవ వెల్లడించారు. జాదవ్ న్యాయ సహాయానికి నో చెప్పాడని పాక్ చేస్తున్న ప్రచారం అసత్యమని వెల్లడైనట్లైంది.

మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవసరమైన సంతకాలు కూడా పెట్టనీయకుండా…పాక్ అధికారులు అనుచితంగా..వ్యవహరించారని తెలిపారు. పాక్ ఆర్మీ కోర్టు జాదవ్ కు విధించిన మరణ శిక్షపై ఇస్లామాబాద్ హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఈనెల 20వ తేదీతో ముగియనుంది.

జాదవ్ విషయంలో పాక్ ఏకపక్షంగా మరణశిక్ష విధించిందంటూ భారత్..అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ఐసీజే విచారణ జరిపింది. మరణశిక్షపై పునఃసమీక్ష జరపాలని ఆదేశాలు ఇచ్చింది.

జాదవ్ న్యాయ సహాయం పొందేందుకు వీలుగా దౌత్య పరమైన అనుమతులు ఇవ్వకపోవడం వియన్నా ఒప్పందాన్ని తుంగలో తొక్కడమేనని, నాలుగు గోడల మధ్య ఏకపక్షంగా సాగిన విచారణ ఓ ప్రహసనం అని ఐసీజే పేర్కొంది.

తమ దేశ రహస్యాలను భారత్ కు చేరవేస్తున్నాడంటూ జాదవ్ ను పాక్ భద్రతా బలగాలు అరెస్టు చేయగా, మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇతడికి న్యాయ సహాయం అందచేయాలని అంతర్జాతీయ కోర్టు ఆదేశించింది.

గత సంవత్సరం సెప్టెంబర్ లో మొదటిసారి లాయర్లను కలిసే అవకాశం ఇచ్చింది. తర్వాత…రెండో దఫా భేటీకి ఇప్పుడు అనుమతినిచ్చింది.