భారత్‍పై పాకిస్తాన్ భారీ కుట్ర, ఎల్‌వోసీ వెంట చైనాకు మద్దతుగా 20వేల మంది సైనికులు మోహరింపు

భారత్‍పై పాకిస్తాన్ భారీ కుట్ర, ఎల్‌వోసీ వెంట చైనాకు మద్దతుగా 20వేల మంది సైనికులు మోహరింపు

భారత్ పై పాకిస్తాన్ భారీ కుట్ర పన్నిందా? సరిహద్దు వివాదం పరిష్కారం కోసం చైనాతో శాంతి చర్చలు కొనసాగుతున్న తరుణాన్ని పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ అవకాశాలను వెతుక్కుంటోందా? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ్రవాదులతో దాడులకు పథకం పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పాకిస్తాన్ తీరు, చర్యలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి.

చైనాకు మద్దతుగా సైన్యాన్ని మోహరించిన పాకిస్తాన్:
తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్‌.. భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసికట్టుగా కుతంత్రం పన్నుతున్నాయి. లఢక్‌ తూర్పు భాగంలో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా 20వేల మంది సైనికులను మోహరించింది. చైనాకు మద్దతుగా అంతే మొత్తంలో లఢక్‌ పశ్చిమ భాగంలోని గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లో(Gilgit-Baltistan) పాకిస్తాన్‌ కూడా సైన్యాన్ని దించింది. చైనా సేనలకు దీటుగా ఏకంగా 20వేల మంది సైనికులను అక్కడ మోహరించింది పాకిస్తాన్.

ఆక్రమిత కశ్మీర్‌కు భారీగా పాక్‌ దళాలు:
ఆక్రమిత కశ్మీర్‌కు పాకిస్తాన్‌ కూడా భారీగా సైనిక బలగాలను తరలిస్తోంది. గిల్గిత్‌ బాల్టిస్థాన్‌లోని ఎల్‌వోసీ వెంట దాదాపు 20వేల మంది పాక్‌ సైనికులను మోహరించినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. గిల్గిత్‌ బాల్టిస్థాన్‌ ప్రాంతం లఢక్‌కు పశ్చిమ భాగంలో ఉంటుంది. మరోవైపు జమ్ముకశ్మీర్‌లో పెద్ద ఎత్తున హింసకు పాల్పడాలని పాక్ కి చెందిన అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థకు చైనా సూచించినట్టు భారత గూఢచారులు కనిపెట్టారు. గల్వాన్‌ ఘర్షణ తర్వాత పాక్‌, చైనా అధికారుల మధ్య కూడా సంప్రదింపులు పెరిగాయని గుర్తించారు.

కశ్మీర్‌లో మారణహోమం సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులతో చైనా చర్చలు:
ఓవైపు సైనిక బలగాలను మోహరించే పనిలో బిజీగా ఉంటూనే, మరోవైపు జమ్ముకశ్మీర్‌లో మారణహోమం సృష్టించేందుకు చైనా కుట్రలు పన్నింది. ఇందుకోసం పాక్‌కు చెందిన అల్‌బదర్‌ ఉగ్రవాద సంస్థతో చైనా అధికారులు చర్చలు జరిపినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కుతంత్రంతో దీటుగా సమాధానం చెప్పేందుకు భారత్‌ కూడా సిద్ధమైంది. కశ్మీర్‌లోకి మరింత మంది ఉగ్రవాదులను చొప్పించేందుకు చైనా ప్రోత్సాహంతో పాకిస్తాన్ ముమ్మర ప్రయాత్నాలు చేస్తోంది. పాక్ కమాండోలు, ఉగ్రవాదులతో కూడిన బ్యాట్ దళాలతో సరిహద్దు వెంబడి భారత భద్రతా దళాలపై దాడుల చేయాలనే యోచనలో కూడా ఉందట. మొత్తంగా చైనాతో భారత్‌కు ఉన్న వివాదం అడ్డుపెట్టుకుని తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలని పాక్ కుయుక్తులు పన్నింది. దీన్ని పసిగట్టిన భారత్.. ప్రతివ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.

డ్రాగన్ ఆర్మీ భారీ సన్నాహాలు, 20వేల మంది సైనికులు మోహరింపు:
గల్వాన్‌లో భారత్‌, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత ఎల్‌ఏసీ వెంట చైనా సైన్యం భారీగా పెరిగింది. జిన్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లో 12 వేలమంది పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సైనికులు ఎల్‌ఏసీ చేరుకొనేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఎల్‌ఏసీ దగ్గర 20వేల మంది చైనా సైనికులు ఉన్నట్టు భారత సైన్యం గుర్తించింది. జిన్‌జియాంగ్‌లో భారీగా ఆయుధాలు నిల్వచేశారు. సైనికులను వేగంగా తరలించే వాహనాలు కూడా అక్కడ ఉన్నట్టు భారత రక్షణ వర్గాలు తెలిపాయి. చైనా సైన్యం కదలికలను నిశితంగా గమనిస్తున్నామని తెలిపాయి.

బలగాల సంఖ్యను పెంచిన చైనా:
టిబెట్‌ రీజియన్‌లో చైనా సాధారణంగా రెండు డివిజన్ల సైన్యాన్ని నిలిపి ఉంచుతుంది. ఒక్కో డివిజన్‌లో వెయ్యిమంది సైనికులు ఉంటారు. కానీ ప్రస్తుతం నాలుగు డివిజన్ల సైన్యం అక్కడ ఉందని సమాచారం. చైనా సైనికుల కదలికలు పెరగటంతో తూర్పు లఢక్‌లో భారత్‌ కూడా సైన్యాన్ని పెంచింది. ఈ ప్రాంతంలో సాధారణం కంటే రెండు డివిజన్ల సైనికులను ఎక్కువగా మోహరించింది. వీరిలో రిజర్వు మౌంటెయిన్‌ డివిజన్‌ కూడా ఉంది. ఈ డివిజన్‌ ఏటా ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. యుద్ధ ట్యాంకులు, బీఎంపీ-2 ఇన్‌ఫాంట్రీ కంబాట్‌ వాహనాలను కూడా అందుబాటులో ఉంచారు. తూర్పు లఢక్‌లో ఎల్‌ఏసీ వెంట భద్రతను ప్రస్తుతం త్రిశూల్‌ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌తోపాటు మరో మూడు స్థానిక బ్రిగేడ్లు పర్యవేక్షిస్తున్నాయి.

విడతలవారీగా బలగాల ఉపసంహరణ:
జూన్ 15న గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తర్వాత పాక్‌, చైనా అధికారుల మధ్య నిత్యం సంప్రదింపులు జరుగుతున్నాయి. లఢక్‌లో వాస్తవాధీన రేఖ వెంట విడుతలవారీగా సైన్యాన్ని ఉపసంహరించాలని భారత్‌-చైనా నిర్ణయించాయి. రెండు దేశాల లెఫ్టినెంట్‌ జనరళ్లు బుధవారం(జూలై 1,2020) 12గంటలపాటు జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయించినట్టు భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

Read:రెండు చైనా కంపెనీలపై అమెరికా నిషేధం.. భారత్‌పై ప్రభావం ఉంటుందా?