Pak Model: చిక్కుల్లో మోడల్.. పాక్ చట్టపరమైన చర్యలు.. అక్కడ ఫొటో దిగడం వల్లే!

పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్‌లో తలకు స్కార్ఫ్ లేకుండా పాకిస్తాన్ మోడ‌ల్ సౌలేహ చేసిన ఫోటో షూట్ వివాదాలకు కారణం అయ్యింది.

Pak Model: చిక్కుల్లో మోడల్.. పాక్ చట్టపరమైన చర్యలు.. అక్కడ ఫొటో దిగడం వల్లే!

Model

Pak Model: పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తార్‌పూర్‌లో తలకు స్కార్ఫ్ లేకుండా పాకిస్తాన్ మోడ‌ల్ సౌలేహ చేసిన ఫోటో షూట్ వివాదాలకు కారణం అయ్యింది. పాకిస్తానీ ఫ్యాషన్ బ్రాండ్ మన్నత్ క్లాతింగ్ తమ దుస్తులను ధరించిన మోడల్ ఫోటోగ్రాఫ్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేసిన వెంటనే ఆన్‌లైన్‌లో నెటిజన్లు వారిపై విమర్శలు గుప్పించారు.

పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా సిక్కులకు పవిత్ర స్థలం కాగా సిక్కులను అవమానించే విధంగా ఫోటో షూట్ ఉందంటూ ఆమెపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా గురుద్వారాల వద్ద, మహిళలు తమ తలలను కప్పి ఉంచుకోవాలి. ఇది సిక్కు మత సాంప్రదాయం. ఇప్పుడు ఆ సాంప్రదాయాన్ని గౌరవించకపోవడమే వివాదానికి కారణం అవుతోంది.

మోడల్ సౌలేహపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు జోరందుకోగా.. మోడ‌ల్ సౌలేహకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో సిక్కు మతస్తులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మోడ‌ల్ సౌలేహ కూడా క్షమాపణలు చెప్పింది. ఎవ‌రి మ‌నోభావాల‌ను కించ‌ప‌ర‌చ‌డం త‌న ఉద్దేశం కాద‌ని.. తనను క్షమించాలంటూ కోరింది.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. బాధ్యులైన వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. పంజాబ్ ముఖ్యమంత్రి ఉస్మాన్ బుజ్దార్ ఈ అంశంపై పూర్తి నివేదికను కూడా కోరారు.


లాహోర్‌కు చెందిన ఫ్యాషన్ హౌస్ మన్నాత్ క్లాతింగ్ ఈ ఫోటోలను షేర్ చెయ్యగా.. క్షమాపణ ప్రకటనను కూడా విడుదల చేసింది. మేము ఈ కంటెంట్‌ను తొలగిస్తున్నాము. మా తప్పును అంగీకరిస్తున్నాము. దీనివల్ల బాధపడ్డ ప్రతి ఒక్కరికీ మేము క్షమాపణలు చెబుతున్నాము. అంటూ ప్రకటన చేసింది.