పాక్ కుట్ర….కరోనా పేషెంట్లను సైలెంట్ గా POKకు తరలింపు

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2020 / 09:58 AM IST
పాక్ కుట్ర….కరోనా పేషెంట్లను సైలెంట్ గా POKకు తరలింపు

ఓవైపు ప్రపంచమంతా కరోనా(కోవిడ్-19) వైరస్‌ తో అల్లాడుతోంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు పలు దేశాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించేశాయి. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం ఓ వైపు సరిహద్దుల దగ్గర భారత జవాన్లపై కాల్పులకు తెగబడుతూనూ..మరోవైపు తమ కరోనా సోకిన పేషెంట్లను సైలెంట్ గా పాక్  ఆక్రమిత కశ్మీరు (POK)లోకి, గిల్గిట్ బాల్టిస్థాన్‌లోకి తరలిస్తోంది. దీంతో ఈ రెండు ప్రాంతాల ప్రజలు తీవ్రమైన నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ పాకిస్థాన్ సైన్యం పట్టించుకోవడం లేదు. మరోవైపు పాక్ ఆక్రమణలో ఉన్న ఈ రెండు ప్రాంతాలు అత్యంత దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. సాధారణ రోగాలకు సైతం ఇక్కడ వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం గమనార్హం.

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ లో కరోనా పాజిటివ్ రోగులను పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌లకు బలవంతంగా పాకిస్థాన్ సైన్యం తరలిస్తోందని పీఓకేలోని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. పీఓకేలోని మీర్‌పూర్‌, తదితర ప్రధాన నగరాల్లో స్పెషల్ క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపాయి. పాకిస్థాన్ సైనిక స్థావరాలు, సైనిక కుటుంబాల నివాస ప్రాంతాలు ఉన్నచోట, వాటికి సమీపంలో కరోనా పాజిటివ్ రోగులు ఉండటానికి వీల్లేదని సైనిక ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకే పంజాబ్ ప్రావిన్స్‌లోని కరోనా పేషెంట్లను బలవంతంగా తరలిస్తున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో ఈ వ్యాధిగ్రస్థులను తాళాలు వేసిన వాహనాల్లో పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌లలోని మీర్‌పూర్, ముజఫరాబాద్, తదితర నగరాలకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. 

మీర్పూర్ సిటీలోని ఓ హాస్పిటల్ కే పాకిస్తాన్ 200మందికి పైగా కరోనా పేషెంట్లను తరలించినట్లు కశ్మీర్ పొలిటికల్ యాక్టివిస్టులు తెలిపారు. పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌ ప్రజలు ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తమ ప్రాంతంలో వైద్యపరమైన సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయని, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది కూడా లేరని, కరోనా రోగులను పాకిస్థాన్ నుంచి తమ ప్రాంతాలకు తరలించవద్దని కోరుతున్నారు. కరోనా విస్తరించి, తమ ప్రాంతంలోని స్థానిక కశ్మీరీల జీవితాలను ప్రమాదంలోకి నెడుతుందని, ఈ ప్రాంతం మొత్తం నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ సైన్యం కశ్మీరీలకు మరోసారి ద్రోహం చేస్తోందని మండిపడుతున్నారు. ఇదిలావుండగా, పంజాబ్ ప్రావిన్స్‌తో పోల్చుకుంటే, పీఓకే, గిల్గిట్ బాల్టిస్థాన్‌‌లకు పాకిస్థాన్ రాజకీయాల్లో ప్రాధాన్యం లేదు. అందువల్ల పాకిస్థాన్ ఆర్మీ ఈ ప్రాంతాల ప్రజల నిరసనను పట్టించుకోవడం లేదు. 

మరోవైపు అంతర్జాతీయ సహాయం పొందేందుకు పాకిస్తాన్ ఉద్దేశ్యపూర్వకంగానే కరోనా వైరస్ వ్యాప్తిని చేస్తుందని కశ్మీర్ రాజకీయ కార్యకర్తులు ఆరోపిస్తున్నారు. కరోనా పేషెంట్లను పీవోకే తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ ప్రతినిధి నాజిర్ అజీజ్ ఖాన్ తెలిపారు. కరోనా పేషెంట్లను ఉంచేందుకు పాకిస్తాన్ లో చాలా ఖాళీ ప్లేస్ లు,హాస్పిటల్స్ ఉన్నాయని అజీజ్ తెలిపారు. పీవోకేలోకి పాకిస్తాన్ 200మంది వైరస్ సోకిన పేషెంట్లను తరలించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. పాకిస్తాన్ లో ఇప్పటివరకు 1047మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. ఇందులో 19మంది కోలుకోగా,8మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read | పీసీసీ చీఫ్ ఎవరో ప్రకటించేలోపే.. కాంగ్రెస్ కొంప ముంచిన కరోనా!