పాములు, గబ్బిలాలు కాదట.. కరోనా వైరస్ కు అసలు కారణం ఇదేనట

కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 03:39 AM IST
పాములు, గబ్బిలాలు కాదట.. కరోనా వైరస్ కు అసలు కారణం ఇదేనట

కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. కాగా, ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోలేకపోయారు. దీంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ ప్రాణాంతక వైరస్ ఎలా పుట్టింది? ఎక్కడి నుంచి వచ్చింది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

పాములు, గబ్బిలాలు కాదట:
కరోనా వైరస్ ఏ జంతువు వల్ల వచ్చిందనే విషయంలో శాస్త్రవేత్తలు రోజుకో కొత్త విషయం చెబుతున్నారు. మొన్నటి వరకు పాములు వల్ల వచ్చిందన్నారు. ఆ తర్వాత గబ్బిలాల వల్ల వచ్చిందని చెప్పారు. తాజాగా ఈ వైరస్ వ్యాప్తికి అలుగు(పాంగొలిన్)(pangolin) కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. పాంగొలిన్ జన్యు క్రమాన్ని పరిశీలించినప్పుడు 99శాతం వరకు కరోనా వైరస్ తో సరిపోలిందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. చైనా సహా మరికొన్ని దేశాల్లో అలుగులను మాంసంగా తింటారు. దీంతో వైరస్ వ్యాప్తికి ఇదే కారణమై ఉంటుందని దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

పునుగు పిల్లితో సార్స్:
1000కిపైగా జంతువుల నుంచి నమూనాలను సేకరించిన శాస్త్రవేత్తలు.. వాటి జన్యుక్రమాన్ని విశ్లేషించారు. ఇందులో పాంగొలిన్‌తో వైరస్ భాదితుల నమూనాలు సరిపోలాయి. కాగా, జన్యు విశ్లేషణ ప్రకారం.. గబ్బిల్లాల్లోని 96 శాతం కరోనా తరహా వైరస్ బాధితుల నమూనాలతో సరిపోలినట్టు గతంలో తేలింది. అయితే ఫ్రాన్స్‌కు చెందిన పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో మాత్రం గబ్బిలాల నుంచి నేరుగా కరోనా వైరస్ మనుషులకు సోకదని గుర్తించారు. వైరస్ వ్యాప్తికి మరో జంతువు కారణమని వారు భావించారు. దీంతో మళ్లీ గందరగోళం మొదలైంది. ఇక, 2002-03లో చైనాలో స్వైర విహారం చేసిన సార్స్ వ్యాధికి ప్రధాన కారణం పునుగు పిల్లి. దీని మాంసం చాలా రుచికరంగా ఉంటుందని చైనీయులు అమితంగా ఇష్టపడతారు.

అసలు కారణం తెలిసేది ఎప్పుడు?
వైరస్ కు మూల కారణం ఏంటనేది స్పష్టంగా తెలియాలంటే వూహాన్ సెంట్రల్ మార్కెట్‌లోని ప్రతి జంతువును టెస్టు చేయాల్సి ఉంది. కానీ అది అసాధ్యమని అంటున్నారు. గతంలో ఎబోలా వైరస్ రావడానికి కారణం గబ్బిలాలే అని కచ్చితంగా చెప్పగలిగామని ఫ్రాన్స్ వైరాలజిస్టు మార్టిన్ పీటర్స్ చెప్పారు. ఆ సమయంలో పలు చోట్ల నుంచి గబ్బిలాల విడుదల చేసిన డ్రాప్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత ఎబోలా వ్యాప్తికి కారణం గబ్బిలాలే అని తేల్చడం జరిగిందని చెబుతున్నారు.

కానీ కరోనా వైరస్ ఏ జంతువు నుంచి మనిషికి సోకుతుందనే దానిపై స్పష్టత లేదన్నారు. గుడ్డిగా గబ్బిలం అని చెప్పలేమని వివరించారు. ఇప్పటికే సమయం మించిపోయిందని.. అయినప్పటికీ ఏ జంతువు నుంచి కరోనా వైరస్ సోకుతుందో గుర్తిస్తే భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు మార్టిన్ పీటర్స్. కరోనా వైరస్ కి అసలు కారణం ఏంటో కానీ.. రోజుకో జంతువు పేరుని తెరపైకి తెస్తున్నారు శాస్త్రవేత్తలు. దీంతో కన్ ఫ్యూజన్ మరింత పెరుగుతోంది.