Pervez Musharraf: కార్గిల్ వార్ కింగ్‌పిన్.. దేశ రాజ్యాంగాన్నే రద్దు చేసిన దుస్సాహసి.. అసలెవరీ ముషారఫ్?

Pervez Musharraf: కార్గిల్ వార్ కింగ్‌పిన్.. సైనిక పీఠం ఎక్కించిన ప్రధానినే కూలదోసిన ఈ సైనిక నియంత ప్రయాణమేంటి?

Pervez Musharraf: కార్గిల్ వార్ కింగ్‌పిన్.. దేశ రాజ్యాంగాన్నే రద్దు చేసిన దుస్సాహసి.. అసలెవరీ ముషారఫ్?

Pervez Musharraf: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ ఆదివారం కన్నుమూశారు. పాకిస్తాన్ రాజకీయాల్లో పెను సంచనాలకు కారణమైన ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అమెరికన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసి, తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకోవడంతో ముషారఫ్ పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. దేశ రాజ్యాంగాన్నే రద్దు చేసి దేశద్రోహం కేసు ఎదుర్కొన్న దుస్సాహసి. బేనజీర్ భుట్టో, లాల్ మసీదు మతపెద్ద అబ్దుల్ రషీద్ ఘాజీ హత్య కేసుల్లో ఆరోపణలు చవిచూసిన ముద్దాయి. పరిస్థితులు ఎదురుతిరగడంతో దేశం విడిచి పారిపోయి ప్రవాస జీవితం గడిపిన పిరికివాడు.

ఢిల్లీలో జననం.. కరాచీలో చదువు..
బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం రాకముందు.. అవిభాజ్య భారత రాజధాని ఢిల్లీలో.. ఓ ముస్లిం కుటుంబంలో పుట్టారు పర్వేజ్ ముషారఫ్. ఆయన తండ్రి ఓ దౌత్యవేత్త. తల్లి టీచర్. దేశం విడిపోయిన తర్వాత ఆ కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. ఉన్నత విద్యావంతులైన ముస్లిం కుటుంబంలో పుట్టిన పర్వేజ్ ముషారఫ్.. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూలులో చదుకున్నారు. ఆ తర్వాత లాహోర్‌లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌లో చేరారు. 1961లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో చేరిన ముషారఫ్.. 1964లో పాకిస్థాన్ ఆర్మీలోకి వచ్చారు.

అంచెలంచెలుగా ఎదుగుతూ..
మిలిటరీలో చేరిన ఏడాదికే ముషారఫ్‌ను భారత సరిహద్దుల్లో విధులకు పంపింది పాకిస్థాన్ ఆర్మీ. 1965లో జరిగిన భారత్‌- పాక్‌ యుద్ధంలో సెకండ్ లెఫ్టినెంట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌లో చేరిన ముషారఫ్‌.. 1971 యుద్ధంలో ఎస్‌ఎస్‌జీ బెటాలియన్‌ కంపెనీ కమాండర్‌గా పనిచేశారు. దేశంలోని రాజకీయవేత్తల కుటుంబాలతో ఉన్న పాతపరిచయాలతో.. అంచెలంచెలుగా ఎదుగుతూ మేజర్‌ జనరల్ స్థాయికి చేరారు. మిలిటరీ ఆపరేషన్స్‌కు డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌కు.. చీఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ కామత్‌తో పొసగకపోవడంతో.. ముషారఫ్‌ను ఆ పదవికి ఎంపిక చేశారు.. అదే పాకిస్థాన్ చరిత్రను మలుపుతిప్పిన మరో నియంత పుట్టుకకి కారణమైంది.

సైనిక తిరుగుబాటు చేసి..
1998లో చీఫ్‌ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ముషారఫ్.. ఆ తర్వాత ఏడాదికే ఇండియాపై యుద్ధానికి కాలుదువ్వారు. కనీసం ప్రధానికి సమాచారం లేకుండానే యుద్ధానికి పూనుకోవడం అప్పట్లో పాకిస్థాన్‌లో అశాంతిని క్రియేట్ చేసింది. కార్గిల్‌లోకి పాక్‌సేనలను పంపించిన ముషర్రాఫ్.. వాళ్లు పాక్ సైనికులు కాదని.. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న ముజాహుద్దీన్‌లంటూ నమ్మించడానికి ప్రయత్నించారు. కానీ.. ఆయన ఆటలు సాగలేదు. కార్గిల్ వార్‌లో పరాజయం తర్వాత.. తనను పదవి నుంచి తప్పించేందుకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం సిద్ధమైందని తెలుసుకున్న ముషారఫ్.. ఏకంగా ప్రభుత్వాన్నే కూలదోశారు. అప్పటికే సైన్యాన్ని గుప్పిట్లో పెట్టుకున్న ముషారఫ్.. సైనిక తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టారు. ప్రధాని నవాజ్ షరీఫ్‌ని గృహనిర్బంధం చేసి.. ఆ తర్వాత అరెస్టు చేశారు. పదవి ఇచ్చిన ప్రధానికే వెన్నుపోటు పొడిచారు పర్వేజ్ ముషారఫ్.

ముషారఫ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి…