ఈ బంధం విడదీయలేనిది : INFRA అంటే ఇండియా+ఫ్రాన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : August 23, 2019 / 10:07 AM IST
ఈ బంధం విడదీయలేనిది : INFRA అంటే ఇండియా+ఫ్రాన్స్

ఫ్రాన్ లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. ఆర్టికల్ 370 రద్దుపై మరోసారి ఫ్రాన్స్ బహిరంగంగా భారత్ కు మద్దతు తెలిసింది.  రాజధాని పారిస్ లోని యునెస్కో హెడ్ క్వార్టర్స్ లో భారతీయ కమ్యూటినీ ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. 1950,1966లో ఫ్రాన్స్ లోని సెయింట్ గర్వైస్ లో రెండు వేర్వేరు ఎయిరిండియా విమాన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ,గ్రేట్ ఇండియన్ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ హోమీ బాబాకు సెల్యూట్ చేస్తున్నట్లు మోడీ తెలిపారు. భారత్-ఫ్రాన్స్ ల మధ్య స్నేహం ఈ నాటిది కాదని మోడీ అన్నారు.

భారత్-ఫ్రాన్స్ బంధం విడదీయలేనిదన్నారు. కష్ట,నష్టాల్లో భారత్,ఫ్రాన్స్ లు పరస్పరం సహరించుకుంటాయన్నారు. ఫుట్ బాల్ లవర్స్ ఉన్న దేశానికి తాను వచ్చానని, గోల్ ప్రాముఖ్యత గురించి ఫ్రాన్స్ ప్రజలకు బాగా తెలుసునని,అదే చివరి విజయమని, గతంలో పూర్తి చేయడం అసాధ్యం అనుకున్న గోల్స్ ని గడిచిన ఐదేళ్లలో తాము సెట్ చేశామని మోడీ అన్నారు.  ఈ 21వ శతాబ్దంలో మనం ఇన్ ఫ్రా(INFRA) గురించి మాట్లాడుతున్నామని, INFRA అంటే తన దృష్టిలో IN+FRA అని మోడీ అన్నారు. IN అంటే ఇండియా అని FRA అంటే ఫ్రాన్స్ అని ఇండియా,ఫ్రాన్స్ మధ్య సంబంధం అని దీనిర్థమని మోడీ అన్నారు. 

నవ భారత నిర్మాణం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మోడీ అన్నారు. కొత్త భారత్ కోసమనే ప్రజలు తమకు భారీ మెజార్టీ ఇచ్చారన్నారు. కొత్త భారత్ లో అవినీతిని లేకుండా చేస్తామన్నారు. ఉగ్రవాదాన్ని తరిమికొడతామన్నారు. మరోసారి కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన 75 రోజుల్లోనే అనేక బలమైన నిర్ణయాలు తీసుకున్నట్లు మోడీ తెలిపారు.

 ఈజ్ ఆఫ్ డూయింగ్ లోనే కాకుండా ఈజ్ ఆఫ్ లివింగ్ లోనూ భారత్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని ప్రధాని మోడీ అన్నారు. భారతీయ సంస్కృతి,సంప్రదాయాలు ప్రపంచానికి గర్వకారణమన్నారు. గడిచిన ఐదేళ్లలో భారత్ లో ఎన్నో సానుకూల మార్పులు వచ్చాయన్నారు. భారత్ వేగంగా దూసుకుపోతుందని తాను చెప్పదలుచుకుంటున్నట్లు మోడీ తెలిపారు. 

పేదరికం నుంచి భారత్ క్రమంగా బయటపడుతోందన్నారు. 2030 నాటికి టీబీ నిర్మూలనే ప్రపంచ లక్ష్యమన్నారు. 2025నాటికి క్షయ నిర్మూలన దిశగా భారత్ కృషి చేస్తోందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే జలశక్తి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామన్నారు. నీటి సంబంధ సమస్యల పరిష్కారంపై ఈ మంత్రిత్వ శాఖ పనిచేస్తుందన్నారు. అంతకుముందు యునెస్కో కార్యాలయంలో యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రే అజౌలే తో మోడీ సమావేశమయ్యారు.