రష్యా ప్రతిపక్ష నేత అరెస్ట్.. అక్రమం అంటున్న అమెరికా!

రష్యా ప్రతిపక్ష నేత అరెస్ట్.. అక్రమం అంటున్న అమెరికా!

రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీని మాస్కో విమానాశ్రయంలో దిగగానే అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. గత వేసవి కాలంలో విషప్రయోగం జరిగిన తర్వాత జర్మనీలో చికిత్స పొందుతున్న నవాల్నీ దేశానికి తిరిగిరాగానే అరెస్ట్ అయ్యారు. ఈ చర్యతో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి పాశ్చాత్య దేశాల విమర్శలను ఎదుర్కొంటున్నారు. అమెరికా, ఫ్రాన్స్‌తో సహా పలు దేశాలు రష్యా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. వెంటనే నవాల్నీని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే బలగాలు ఆయనను అదుపులోకి తీసుకోగా.. ఈ ఘటనను ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఐదు నెలల క్రితం నవాల్నీపై విష ప్రయోగం జరగగా.. అప్పటినుంచి జర్మనీలో చికిత్స చేయించుకుంటున్నారు. తొలిసారి సొంత దేశానికి తిరిగి రాగా.. నవాల్నీని అరెస్ట్ చేశారు. విష ప్రయోగం వెనుక అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందనే ఆరోపణలు ఇప్పటికే వ్యక్తం అయ్యాయి.

అరెస్టుకు ముందు నావెల్నీ విమానాశ్రయంలో కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడారు. రష్యాకు తిరిగి రావడం తనకు సంతోషంగా ఉందన్నారు. ఏమాత్రం పశ్చాత్తాపం పడడం లేదన్నారు. గత ఐదు నెలల్లో తనకు ఇదే అత్యంత మంచిరోజని చెప్పారు. అరెస్ట్‌కు ముందు నవాల్నీ తన భార్యను ముద్దాడి ఆమెకు ధైర్యం చెప్పారు. నవాల్నీని రష్యాలో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేస్తామని గత వారమే అక్కడి పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నవాల్నీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో పాటు ఆయనపై మరో మూడు కేసులు ఉన్నాయి.