ముస్లింలను అణిచివేస్తున్నారు…చైనాపై పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం

  • Published By: venkaiahnaidu ,Published On : November 25, 2020 / 02:44 AM IST
ముస్లింలను అణిచివేస్తున్నారు…చైనాపై పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం

Pope Francis calls China’s Uighur Muslims ‘persecuted’ చైనా అనుసరిస్తున్న తీరుపై క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంత్రుత్వానికి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న చైనాలో.. ముస్లింల బాధలు అన్నీ ఇన్నీ కావు. ఆ దేశంలో ముస్లింల స్వేచ్ఛను చైనా అణచివేస్తుందని ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయమై ప్రముఖ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ చైనాపై మండిపడ్డారు.



ఉయిఘర్‌ ముస్లిం మైనారిటీలను చైనా అణచివేస్తోందని పోప్‌ ఫ్రాన్సిస్‌ విమర్శించారు. తన కొత్త పుస్తకం ‘లెట్‌ అజ్‌ డ్రీమ్.. ది పాత్ టూ ఏ బెటర్ ఫ్యూచర్‌’లో ఉయిఘర్ ముస్లింల ప్రస్తావన తెచ్చారు పోప్‌ ఫ్రాన్సిస్. చైనాలో తీవ్ర నిర్బంధంలో కాలం వెల్లదీస్తున్న వీరిని గురించి తాను నిరంతరం ఆవేదన చెందుతానని పోప్ ఆ పుస్తకంలో రాసుకొచ్చారు. ఉఘయిర్ ముస్లింలను చైనా అత్యంత దారుణంగా అణచివేయడం తనను కలవరపరుస్తుందని అన్నారు.



పాక్‌ ప్రభుత్వ దాష్టికానికి బలవుతున్న యాజైదీ ముస్లింలపై కూడా పోప్ స్పందించారు.ఉయిఘర్‌,రోహింగ్యాలు,యాజైదీ వంటి అణచివేతకు గురవుతున్న వర్గాల గురించి తరచూ తాను ఆలోచిస్తానంటూ పోప్ తన పుస్తకంలో తెలిపారు.



ఇస్లామిక్‌ దేశాల్లో క్రైస్తవులపై జరుగుతున్న దాష్టికాలను కూడా పోప్ తన పుస్తకంలో ఆయన ప్రస్తావించారు. ఇస్లామిక్ దేశాల్లో అణచివేతకు గురవుతున్న క్రిస్టియన్ల దుర్భర జీవితాలను చూసినప్పుడల్లా తనకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఈ అసమానతలు తొలగిపోవాలని ఆయన ఆకాంక్షించారు.



ప్రపంచంలోని పలు దేశాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో మార్పులు రావాలని.. అప్పుడే సమాజంలో అసమానతలు తొలగి.. అందరూ సమానంగా జీవించే అవకావం ఉంటుందని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు.
అమెరికా నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంపై పోరాడిన వారిపై పోప్ ప్రశంసల వర్షం కురిపించారు.



కాగా, పోప్‌ వ్యాఖ్యలను చైనా ఖండించింది. చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జావో లిజియన్‌ ఖండించారు. ఆయన వ్యాఖ్యలకు ‘వాస్తవమైన ఆధారం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి జావో లిజియన్ అన్నారు. అన్ని జాతుల ప్రజలు, మనుగడ, అభివృద్ధి, మత విశ్వాసం పూర్తి హక్కులను పొందుతారన్న ఆయన.. మిలియన్‌కుపైగా ఉయిఘర్లు, ఇతర చైనా ముస్లిం మైనారిటీ గ్రూపు సభ్యులను ఉంచిన శిబిరాల గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.