Afghanistan : అఫ్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాలిబన్లు తర్జనభర్జన

అఫ్ఘానిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేశారు తాలిబన్లు.

Afghanistan : అఫ్ఘానిస్తాన్ లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తాలిబన్లు తర్జనభర్జన

Taliban

Taliban govt formation Postponed : అఫ్ఘానిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటులో తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియను ఇప్పటి వరకు రెండు సార్లు వాయిదా వేసిన తాలిబన్లు.. తాజాగా ప్రభుత్వ ఏర్పాటు కోసం పాకిస్తాన్‌ సాయం కోరినట్లుగా తెలుస్తోంది. తాలిబన్‌ కో ఫౌండర్ ముల్లా బరాదర్ పాక్‌ అధికారులను కలిశారు. పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఫయీజ్‌ హమీద్‌ కాబూల్‌కు నిన్ననే చేరుకున్నారు. ఆయన వెంట పాక్‌ అధికారుల బృందం కూడా వచ్చింది. తాలిబన్ల ఆహ్వానం మేరకే హమీద్‌ అఫ్ఘాన్‌ వచ్చారు. రెండు దేశాల భవితవ్యంపై తాలిబన్‌, పాక్‌లు కలసికట్టుగా వ్యూహరచన చేస్తున్నాయి.

ఇక తొలుత శుక్రవారం ప్రార్థనల అనంతరం గ్రూప్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్ సుప్రీం కమాండర్‌గా కొత్త ప్రభుత్వాన్ని ప్రకటిస్తామని తాలిబన్‌ తెలిపింది. అయితే ఇది నిన్నటికి వాయిదా పడింది. అటు కొత్త ప్రభుత్వం, కేబినెట్‌ మంత్రులను మరో రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని తాలిబన్‌ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. అయితే పరిస్థితి ఇలానే కొనసాగడం అఫ్ఘాన్‌కు మంచిదికాదంటోంది అమెరికా. ప్రభుత్వ ఏర్పాటులో తాలిబన్లు ఆలస్యం చేసే కొద్దీ అక్కడ అంత్యరుద్ధ పరిస్థితులు వచ్చే అవకాశముందని హెచ్చరించింది.

మరోవైపు అంతర్జాతీయ సమాజం కోరుకున్న రీతిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాలిబన్లు భావిస్తుండడం వారి వాయిదాకు ఒక కారణంగా తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం, కేబినెట్‌ సభ్యుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తాలిబన్‌ ప్రతినిధులు స్పష్టం చేశారు. తాలిబన్‌ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని, కానీ, అలాంటి ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి ఆమోదయోగ్యం కాదన్నారు.

మరోవైపు పంజ్‌షిర్‌పై తమ జెండా వెగురవేసిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రకటన చేసే ఆలోచనలో తాలిబన్లు ఉన్నట్టు సమాచారం. 10వేల మంది పంజ్‌షిర్ యోధులు తాలిబన్లతో పోరాటం కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకూ వందలాది మంది తాలిబన్లను పంజ్‌షిర్ దళాలు హతం చేశాయి. మరోవైపు తాలిబన్లు మాత్రం పంజ్‌షిర్‌పై పైచేయి సాధించామనే ప్రకటనలు చేస్తున్నారు. దీంతో అసలు పంజ్‌షిర్‌లో ఏం జరుగుతోందనే గందరగోళం నెలకొంది.

మరోవైపు తాలిబన్ ప్రభుత్వం ఎలా ఉండనుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడైన బరాదర్ నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటు ఇప్పటికే ఖరారైంది. బరాదర్, దివంగత తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా మహమ్మద్ యాకూబ్, షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టానిక్‌జయ్‌లు ప్రభుత్వంలో టాప్ 3 స్థానాల్లో ఉండనున్నారు.

ఇక తాలిబన్ ప్రభుత్వంతో మతపరమైన అంశాలను హైబతుల్లా అఖుద్‌జాదా పర్యవేక్షించనున్నారు. మొత్తం 25 మంత్రిత్వ శాఖలతో ప్రభుత్వం ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత 5 నుంచి 8 నెలల్లో గ్రాండ్ అసెంబ్లీని ఏర్పాటు చేసి అఫ్ఘాన్ సమాజంలోని అన్ని వర్గాల, గ్రూపుల ప్రతినిధులను ఆహ్వానించాలని తాలిబన్లు భావిస్తున్నట్లు సమాచారం.