ప్రెసిడెంట్ ట్రంప్ ఆందోళన : పాకిస్తాన్‌పై దాడి యోచనలో భారత్

  • Published By: veegamteam ,Published On : February 24, 2019 / 01:50 AM IST
ప్రెసిడెంట్ ట్రంప్ ఆందోళన : పాకిస్తాన్‌పై దాడి యోచనలో భారత్

జవాన్లపై ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోందా. పాకిస్తాన్‌పై దాడి యోచనలో ఉందా. అంటే అవుననే అంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పుల్వామా దాడిపై ట్రంప్ మరోసారి స్పందించారు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో తీవ్ర ప్రతిచర్యకు దిగాలని భారత్‌ యోచిస్తున్నట్లు ట్రంప్‌ అన్నారు. కశ్మీర్‌లో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని చెప్పారు.

చైనా వాణిజ్య ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్‌ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పుల్వామా ఉగ్రదాడిపై స్పందించారు. 40మంది జవాన్లను కోల్పోయిన భారత్‌ ప్రతీకార చర్యకు దిగాలని కోరుకోవడాన్ని తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఉగ్రవాదంపై అమెరికా స్పందించిన తర్వాతే ఇతర దేశాలు మాట్లాడుతున్నాయని చెప్పారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనాలని ట్రంప్ ఆకాంక్షించారు.

పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ వరుసగా కఠిన చర్యలు తీసుకుంటోంది. రోజుకో షాక్ ఇస్తోంది. ముందుగా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు చేసింది. పాక్ దిగుమతి సరుకులపై 200 శాతం సుంకం విధించింది. పలు దేశాలతో చర్చలు జరిపి పాకిస్తాన్‌ను ఏకాకి చేసింది. పాక్‌కు నీటిని నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా ఆర్థిక, వాణిజ్య, దౌత్య రంగాల్లో పాక్‌ను భారత్ దెబ్బకొడుతోంది. ఫిబ్రవరి 14వ తేదీన జైష్ ఏ మహమ్మద్ సూసైడ్ బాంబర్ 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్నాడు.