పాక్ లో మార్మోగిన మోడీ నినాదాలు

పాక్ లో మార్మోగిన మోడీ నినాదాలు

Pro-Freedom Rally In Sindh పాకిస్తాన్ లో మోడీ (PM Modi)నినాదాలు మార్మోగాయి. ఆదివారం సింధీ జాతీయవాద వ్యవస్థాపక పితామహుల్లో ఒకరైన జిఎం సయ్యద్ 117 వ జయంతి సందర్భంగా పాక్ లోని సాన్ పట్టణంలో నిర్వహించిన భారీ స్వాతంత్య్ర అనుకూల ర్యాలీలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. తాము స్వేచ్ఛ కోసం ఆరాటపడుతున్నామని.. తమకు మద్దతు కావాలని కోరుతూ సింధ్ ప్రజలు ఈ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పాక్ ప్రభుత్వ వైఖరి నశించాలని డిమాండ్ చేశారు. తమకు స్వతంత్య్రం ఇవ్వాల్సిందేనని… లేకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.

పాక్ ప్రభుత్వం తమను ఆక్రమించుకుని నానా హింసలు పెడుతున్నదని.. తమకు మద్దతు ఇవ్వాలని సింధ్ ప్రజలు మోడీని అభ్యర్థించారు. మోడీతో పాటు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు జో బైడెన్, న్యూజిలాండ్ పీఎం జసిందా,బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా పలువురి ప్లకార్డులని చేతబూని భారీ నిరసన కార్యక్రమం చేశారు. సింధ్ స్వేచ్ఛ కోసం ఆ నాయకుల జోక్యాన్ని అభ్యర్థించారు.

పలువురు నిరసనకారులు మాట్లాడుతూ..సింధ్ ప్రాంతానికి గొప్ప చరిత్ర ఉన్నది. ప్రపంచంలోని అతి పురాతనమైన నాగరికతలలో ఒకటిగా ఉన్న సింధులోయ నాగరికత ఉద్భవించింది ఇక్కడే. ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఆక్రమణదారుల పాలన సాగుతున్నది. ఇక్కడి వనరులను పాక్ ఆక్రమిస్తున్నది. ఇక్కడి చరిత్రను, సంస్కృతీ, సంప్రదాయాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా దాని కుట్రలు ఫలించడం లేదు. ఎంత ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని కుట్రలు చేస్తున్నా ఇక్కడి ప్రాంత ప్రజలు మాత్రం సింధ్ కు ఉన్న ప్రత్యేక సంస్కృతిని కాపాడుకుంటున్నారు. దాని గుర్తింపును అలాగే కాపాడుతున్నారు. సామరస్యపూర్వకంగా కలిసి మెలిసి జీవిస్తూ.. సహనాన్ని చాటుతున్నారు. కానీ పాక్ మాత్రం మాపై ఆక్రమణకు దిగుతోందని తెలిపారు.