కరోనాపై భారత్ పోరాటానికి పాకిస్థాన్ ప్రశంసలు.. ఎయిర్ ఇండియా పట్ల గర్వంగా ఉందన్న పాక్ ATC

  • Published By: sreehari ,Published On : April 5, 2020 / 04:41 AM IST
కరోనాపై భారత్ పోరాటానికి పాకిస్థాన్ ప్రశంసలు.. ఎయిర్ ఇండియా పట్ల గర్వంగా ఉందన్న పాక్ ATC

దేశీయ విమానయన సంస్థ ఎయిర్ ఇండియాకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో విదేశాల్లో అవసరమైన రిలీఫ్ మెటేరియల్స్, మెడికల్ ఎక్విప్ మెంట్ తో పాటు దేశంలో చిక్కుకున్న విదేశీయులను తరలించేందుకు ప్రత్యేక విమాన సర్వీసులను నడిపింది. ఈ సందర్భంగా పలు దేశాల నుంచి ఎయిర్ ఇండియాకు ప్రశంసలతో కూడిన సందేశాలు వచ్చాయి. ఎయిర్ ఇండియాను పొగిడిన దేశాల జాబితాలో పాకిస్థాన్ కూడా వచ్చి చేరింది. పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎయిర్ ఇండియాను పొగడ్తలతో ముంచెత్తింది. 

పైలట్లకు హ్యాట్సాఫ్ అంటూ సెల్యూట్ కొట్టింది. విదేశాల్లో అవసరమైన రిలీఫ్ మెటేరియల్స్, చిక్కుకున్న విదేశీయులను స్వదేశాలకు తరలించేందుకు ఎయిర్ ఇండియా covid-19 రిలీఫ్ ఫ్లయిట్లను నడిపింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా విమానాలను తమ గగనతలంలోకి పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్వాగతించింది. అనిశ్చితి సమయాల్లో ఎయిర్ ఇండియా చేస్తున్న మంచి పనిని పాక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మెచ్చుకుంది. ఏప్రిల్ 2న ఎయిర్ ఇండియా ముంబై నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు రెండు విమానాలను నడిపింది. ఈ రెండు విమానాల్లో రిలీఫ్ మెటేరియల్స్, యూరోపియన్ జాతీయులను తరలించింది. మార్చి 24న దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్ విధిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత ఎయిర్ ఇండియా రిలీఫ్ సర్వీసు విమానాలను నడిపింది. 

ముంబై నుంచి (14:30 గంటలు) విమానం బయల్దేరింది. సరిగ్గా 1700 గంటలకు పాకిస్థాన్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానాలు ప్రవేశించాయి. అదే సమయంలో పాకిస్థాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో ఫ్రీక్వీన్సీలను మార్చేసి ATCను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించినట్టు ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

అదే సమయంలో పాకిస్థాన్ ATC నుంచి పైలట్లకు ఒక సందేశం రావడంతో ఆశ్చర్యపోయారు. ఇది కరాచీ కంట్రోల్‌.. ఎయిర్ ఇండియా రిలీఫ్ విమానాలకు స్వాగతమంటూ పాక్ ఏటీసీ నుంచి సందేశం వచ్చినట్టు తెలిపారు. Frankfurtకు రిలీఫ్ విమాన సర్వీసులను నడుపుతున్నట్టుగా ధ్రువీకరించాలా? అని పాక్ ఏటీసీ అడిగింది.. అందుకు ఎయిర్ ఇండియా పైలట్.. అవును.. అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 

ఎయిర్ ఇండియా అధికారుల ప్రకారం.. కష్టతరమైన సమయాల్లోనూ విదేశాలకు సహాయార్థమై విమాన సర్వీసులను నడిపిన ఎయిర్ ఇండియా పట్ల గర్వంగా ఉంది.. గుడ్ లుక్ అని పాకిస్థాన్ ఏటీసీ ప్రశంసించినట్టు ఎయిర్ ఇండియా పేర్కొంది. దానికి సమాధానంగా ప్లయిట్ కెప్టన్ థ్యాంక్యూ సో మచ్ అంటూ రిప్లయ్ ఇచ్చారు.

పాకిస్థాన్ ఏటీసీ తమ గగనతలంలో కరాచీకి దగ్గరగా వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానాలకు అనుమతి ఇవ్వడం వల్ల 15 నిమిషాల సమయం కలిసొచ్చిందని ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. అంతకుముందు ఎయిర్ ఇండియా సేవలను గుర్తించిన పలు దేశాల్లో టర్కీష్, జర్మన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కూడా ప్రశంసించాయి.