గ్యాస్ స్టవ్ పై రూ.20 లక్షల నోట్ల కట్టలను కాల్చేసిన రెవెన్యూ అధికారి

గ్యాస్ స్టవ్ పై రూ.20 లక్షల నోట్ల కట్టలను కాల్చేసిన రెవెన్యూ అధికారి

Mro  Burns Rs. 20 Lakhs On Gas Stove

Mro  burns rs. 20 lakhs on gas stove  : మనిషి ఏ పని చేసినా కరెన్సీ నోటు కోసమే. ఆ కరెన్సీని కష్టపడీ సంపాదించొచ్చు..అవినీతి చేసి సంపాదించొచ్చు. కానీ సంపాదించింది ఎలా అనేది కాదు ముఖ్యం..చేతిలో కరెన్సీ ఉందా?ఎంతుంది?ఇంకా ఎంత సంపాదించాలి?అనే యావలో అవినీతిలో కొట్టుకుపోతున్న అధికారులు ఎంతమందో..ఉన్నారు. కరెన్సీ నోట్ల కోసం కక్కుర్తిపడి డ్యూటీలను అవినీతికి తాకట్టు పెట్టి కరెన్సీ కట్టలను పోగేసుకునే అధికారులు ఎప్పుడోకప్పుడు దొరక్క తప్పదని ఎన్నో ఘటనలు నిరూపించాయి. కానీ ఇదిలా ఉంటే ఒక్క కరెన్సీ నోటు కనిపిస్తేనే మహదానంగా దాచుకుంటాం. కానీ ఇద్దరు భార్యాభర్తలు మాత్రం కట్టల కొద్దీ నోట్ల కట్టలను వంటింట్లోకి తీసుకొచ్చి గ్యాస్ స్టవ్ మీద కాల్చి బూడిద చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 లక్షల రూపాయలను గ్యాస్ స్టవ్ ఆన్ చేసి మరీ కాల్చేశారు. వాళ్లు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..

లంచం తీసుకున్న వ్యక్తికి ఏసీబీ అధికారులు తనిఖీలకు వస్తున్నారని తెలిస్తే ఏం చేస్తారు? మహా అయితే లంచంగా తీసుకున్న డబ్బును ఎక్కడో ఓ చోట భద్రంగా దాచేస్తాడు. లేదా తెలిసినవాళ్ల దగ్గర దాచిపెట్టి దాడులు, ఎంక్వయిరీ హడావిడులు అయిపోయాక తాపీగా దాన్ని తిరిగి తెచ్చుకుని వాడుకుంటాడు. కానీ ఓ తహసీల్దార్ మాత్రం ఏసీబీ అధికారులు తన ఇంటికి సోదాల కోసం వస్తున్నారని తెలిసి..ఏసీబీ అధికారులు ఇంట్లోకి రాకుండా ఇంటి తలుపులు మూసేశాడు. ఆ తరువాత అవినీతికి పాల్పడి కూడబెట్టిన 20 లక్షల రూపాయల డబ్బును వంటింటిలోకి తీసుకెళ్లి గ్యాస్ స్టవ్ మీద కాల్చి బూడది చేసేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది..

రాజస్థాన్ రాష్ట్రంలోని సిరోహీ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయల డబ్బును తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ ను ఏసీబీ అధికారులు బుధవారం (మార్చి 24,2021)రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై పర్వత్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. కానీ అవినీతి చేసినట్లుగా ఒప్పుకోలేదు. దీంట్లో తన తప్పేమీ లేదనీ, తహసీల్దార్ కల్పేశ్ కుమార్ జైన్ ఆదేశాలతోనే తాను ఈ డబ్బును తీసుకున్నానని చెప్పుకొచ్చాడు.

దీంతో పర్వత్ ను పట్టుకుని తహసీల్దార్ కల్పేశ్ ఇంటికి ఏసీబీ అధికారులు బయలు దేరారు. ఈ విషయం ఇంట్లోనే ఉన్న తహసీల్దార్ కు ముందుగానే సమాచారం ఇచ్చేశారు. అంతే లంచంగా తీసుకున్న డబ్బును ఏం చేయాలో తెలియక సతమతమయ్యాడు. కంగారుపడిపోయాడు. ఏం చేయాలా? అని ఆలోచించాడు. చివరకు ఓ నిర్ణయానికి వచ్చి.. బీరువాలో ఉన్న కట్టలకొద్దీ డబ్బును వంటింట్లోకి తీసుకొచ్చాడు.

గ్యాస్ స్టవ్ ఆన్ చేశాడు. కరెన్సీ కట్టలను ఒక్కొక్కటిగా కాల్చేయడం మొదలు పెట్టాడు. అతడి భార్య భర్తకు సహకరించింది. ఏసీబీ అధికారులు ఇంట్లోకి రాకుండా తలుపులకు గడియ పెట్టేసి రూ.20 లక్షల రూపాయల నోట్ల కట్టలను కాల్చేశాడు. ఇంతలో ఏసీబీ అధికారులు ఇంటికి చేరుకున్నారు. వంటింట్లో అతడు చేస్తున్న నిర్వాకాన్ని చూశారు. డబ్బును కాల్చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు.

అయినా..కల్పేశ్ అధికారుల మాటలు వినలేదు. వారి మాటలను పట్టించుకోకుండా ఆ తహసీల్దార్ అదేపనిగా డబ్బును కాల్చేస్తూనే ఉన్నాడు. తలుపులు తీయమని చెప్పినా వినలేదు. బెదిరించినా వినలేదు. దీంతో ఏసీబీ అధికారులు తలుపులు పగలగొట్టి తహసీల్దార్ చేస్తున్న పని ఆపగలిగారు. ఈ ఘటనలో 20 లక్షల రూపాయలు కాలి బూడిదైపోగా, కేవలం లక్షన్నర రూపాయలను మాత్రమే అతడి నుంచి స్వాధీనం చేసుకోగలిగారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు పోయే..పరువు పోయే..కేసులు తప్పక సదరు అవినీతి అధికారి కేసుల పాలయ్యాడు.