ఇది నమ్మలేని నిజం, 1983 వరల్డ్ కప్‌ గెల్చిన కపిల్ దేవ్ ఒక్కో వన్డే ఫీజు రూ.2100

  • Published By: naveen ,Published On : July 28, 2020 / 02:05 PM IST
ఇది నమ్మలేని నిజం, 1983 వరల్డ్ కప్‌ గెల్చిన కపిల్ దేవ్ ఒక్కో వన్డే ఫీజు రూ.2100

ప్రస్తుతం ప్రపంచ‌ క్రికెట్‌ను శాసించే స్థాయిలో భారత్ ఉండటానికి, మన దేశంలో క్రికెట్ ఓ మతంలా మారడానికి కారణం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్‌ గడ్డపై అడుగుపెట్టిన కపిల్‌ దేవ్ సేన.. 17 రోజుల్లో చరిత్రను తిరగరాసి జగజ్జేతగా నిలిచింది. 1983 జూన్ 25న వరల్డ్ కప్ గెలిచింది. ఈ చిరస్మరణీయ విజయం అందుకుని 37 ఏళ్లు దాటాయి. ఇప్పటికీ ఆ టోర్నీ ప్రస్తావన వస్తే చాలు లార్డ్స్ మైదానంలో సిల్వర్ కలర్‌లోని ప్రపంచకప్ అందుకుంటూ కపిల్ ఇచ్చిన స్మైల్ క్రీడాభిమానుల కళ్ల ముందు కదలాడుతుంటుంది.

మ్యాచ్ ఫీజు రూ.1500, డైలీ అలవెన్స్ గా 3 రోజులకు రూ.600, మొత్తం రూ.2100:
కాగా, అలాంటి చిరస్మరణీయ విజయాన్నందించిన ఆటగాళ్లకు ఇచ్చిన మ్యాచ్ ఫీజు కేవలం రూ.2వేల 100 అని తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడంటే స్పాన్సర్లు, బ్రాడ్ క్రాస్టర్లతో క్రికెట్ కొత్త పుంతలు తొక్కడంతో ఆటగాళ్లు కోట్లు సంపాదిస్తున్నారు. క్రికెట్ కాస్ట్లీ గేమ్ గా మారింది. అప్పట్లో ఇదంతా లేదు. మ్యాచ్ ఫీజు రూ. 1500, డైలీ అలవెన్స్ కింద రోజుకు రూ.200 చొప్పున.. ఒకే వన్డేకు రూ.600 ఇచ్చేవారు. దీంతో ఆటగాళ్లకు మొత్తం రూ.2100 అందేవి. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్ల పే స్లిప్‌ను… పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ రమీజ్ రాజా ట్వీట్ చేశాడు. అంతటితో ఊరుకోకుండా, 1986-87 లో భారత పర్యటనలో పాకిస్తాన్ క్రికెటర్లకు అందిన మ్యాచ్ ఫీజుతో పోల్చాడు. నాడు భారత్ లో 5 టెస్టులు, 6 వన్డేలకు కలిపి తమకు రూ.55 వేలు ఫీజు రూపంలో ఇచ్చారని చెప్పాడు.

అప్పటి రూ.2100 ఇప్పటి లక్షల రూపాయలతో సమానం:
రమీజ్ రాజా చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఆ రోజుల్లో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులు చూసి అభిమానులు విస్మయం చెందుతున్నారు. కొందరు మాత్రం రమీజ్ రాజాకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అప్పట్లో ఇది చాలా పెద్ద అమౌంట్ అని, రూ.55వేలు పెడితే 100 ఎకరాల భూమి వచ్చేదని కొందరు అంటే, మరికొందరు రమీజ్ రాజాకు ఇచ్చిన రూ.55వేలు.. ఇప్పటి రూ.15 లక్షలతో సమానం అంటున్నారు. 1983లో భారత క్రికెటర్లకు ఇచ్చిన ఫీజుని, 1987లో పాక్ క్రికెటర్లకు ఇచ్చిన ఫీజుని కంపేర్ చేయడాన్ని కొందరు నెటిజన్లు తప్పుపట్టారు.

ఫైనల్ మ్యాచ్ లో ఇరగదీసిన కపిల్ సేన:
ఇంగ్లండ్ లోని వేల్స్ లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెల్చిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు 183 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్ చూస్తే, ఆ మ్యాచ్ ఈజీగా వారు గెలుస్తారని అంతా అనుకున్నారు. అయితే కపిల్ సేన అద్భుతంగా బౌలింగ్ చేసింది. కెప్టెన్ గా కపిల్ దేవ్ చక్కటి వ్యూహాలు అమలు చేశాడు. మదన్ లాల్, అమర్నాథ్ లు చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. ఆ మ్యాచ్ లో భారత జట్టు 43 పరుగుల తేడాతో విండీస్ పై గెలిచి జగజ్జేతగా నిలిచింది. 1983 వరల్డ్ కప్ టోర్నీలో కెప్టెన్ కపిల్ దేవ్ బ్యాట్ తో వీరవిహారం చేశాడు. మొత్తం 8 మ్యాచుల్లో 303 పరుగులు సాధించాడు. రోజర్ బిన్నీ అత్యధికంగా 18 వికెట్లతో టాపర్ గా నిలిచాడు.

శాలరీగా రూ.7 కోట్లు తీసుకుంటున్న కోహ్లి:
ఏళ్లు గడిచే కొద్దీ క్రికెట్ చాలా కాస్ట్లీ గేమ్ గా మారింది. పెట్టుబుడులు, ఒప్పందాలు, జీతాలు భారీగా పెరిగాయి. క్రికెటర్ల జీవితాలే మారిపోయింది. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆస్తుల విలువ రూ.900 కోట్లు ఉంటుందంటే విస్మయం కలగక మానదు. ప్రస్తుతం ఏ+ గ్రేడ్ లో విరాట్ ఉన్నాడు. జీతం కింద బోర్డు విరాట్ కు రూ.7 కోట్లు చెల్లిస్తోంది.