ప్రపంచానికే పాఠం : 200 రోజులుగా ఒక్క కరోనా కేసు లేదు

  • Published By: madhu ,Published On : October 30, 2020 / 07:43 AM IST
ప్రపంచానికే పాఠం : 200 రోజులుగా ఒక్క కరోనా కేసు లేదు

Record 200 Days With No Local Case Makes Taiwan : కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. తగ్గుముఖం పట్టినా..కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పలు దేశాలు మళ్లీ లాక్ డౌన్ వైపు చూస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతూ…ప్రపంచ దేశాలు రికార్డులు నమోదు చేస్తుంటే..తైవాన్ మాత్రం కొత్త రికార్డు నమోదు చేసింది. గడిచిన 200 రోజుల్లో స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడిస్తోంది.



తైవాన్ లో 2.3 కోట్ల జనాభా ఉంది. ఇంత జనాభా ఉన్నా..వైరస్ కట్టడికి ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంది. దీనివల్ల కేవలం 550 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచానికి తైవాన్ పాఠాలు నేర్పిస్తోంది. సింగపూర్, జపాన్ దేశాలు తొలుత వైరస్ వ్యాప్తిని నిరోధించినా..అక్కడ కేసుల సంఖ్య భారీగా పెరిగింది.



కానీ..తైవాన్ లో మాత్రం ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. భయపడిన కేసులు కూడా..విదేశాల నుంచి వచ్చిన వారే. ఫిలిఫైన్స్, అమెరికా, ఇండోనేషియా దేశాల నుంచి వచ్చిన 20 మంది వైరస్ గుర్తించామని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రబలకుండా..తీసుకున్న చర్యలే సత్ఫలితాలు ఇచ్చాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.



బోర్డర్స్ మూసివేయడం, కచ్చితమైన కాంటాక్ట్ ట్రేసింగ్, సాంకేతికత సాయంతో క్వారంటైన్ లో ఉన్నవారిని పర్యవేక్షించడం ప్రతొక్కరు మాస్క్ ధరించేలా తీసుకున్న చర్యలు కీలకమంటున్నారు. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తిని నిర్మూలించిన ప్రపంచంలో ఏకైక దేశంగా తైవాన్ నిలిచిందని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ కు చెందిన ప్రొఫెసర్ పీటర్ కొలీగ్నాన్ వెల్లడించారు.



కఠినమైన కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్ చర్యలు చేపట్టని ఏ దేశం కూడా కరోనా కట్టడిలో సఫలం కావని తైవాన్ మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎపిడమాలజిస్ట్ చెన్ చైయిన్ జెన్ స్పష్టం చేశారు. అంతేగాకుండా..ప్రజలను క్వారంటైన్ లో ఉంచడం కూడా అంత తేలికైన విషయం కాదని, వారికి సరైన భోజనం, నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు..సాంకేతికత సాయంతో ప్రతిక్షణం వారిని పర్యవేక్షించడం ఎంతో ముఖ్యమని అభిప్రాయం వ్యక్తం చేశారు.



2003 సంవత్సరంలో సార్స్ తైవాన్ పాఠాలు నేర్చుకుంది. వందల మంది ఈ వ్యాధిన పడ్డారు. 73 మంది మరణించారు. బర్డ్ ఫ్లూ, ఇన్ఫూయెంజా వంటి వైరస్ లను ఎదుర్కొన్న తీరును తైవాన్ పరిశీలించింది. ఈ క్రమంలో..కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో మొదటగా అలర్ట్ అయ్యింది. వైరస్ విషయంలో ఎలా వ్యవహరించాలో ముందస్తుగానే అంచనా వేసింది.



ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించింది. ముఖ్యంగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్ లు ధరించడం వంటి చర్యల వల్ల కరోనా వైరస్ ను సాధ్యమైనంత వరకు అరికట్టగలిగారు. మొత్తానికి ప్రపంచానికే తైవాన్ దేశం ఆదర్శంగా నిలుస్తోంది.