రోడ్ బాగు చేయడం లేదని నిరసనగా.. గుంతలో మొక్క నాటిన స్థానికులు

రోడ్ బాగు చేయడం లేదని నిరసనగా.. గుంతలో మొక్క నాటిన స్థానికులు

Plant tree in a Pothole: రోడ్ల మధ్యలో గుంతలు ఉంటే.. ఏ కర్రనో.. పచ్చని కొమ్మనో పెట్టి వాహనదారులను అలర్ట్ చేస్తుంటాం. కానీ, అక్కడి స్థానికులు ఏకంగా మొక్కనే నాటేశారు. నిజానికి వాహనదారులను అలర్ట్ చేయడానికి చేసింది కాదు. పాడైపోయిన రోడ్‌ను బాగుచేయడం లేదనే నిరసనను వ్యక్తం చేయడానికి ఇలా చేశారు. ఆస్ట్రేలియాలోని డైమండ్ క్రీక్ ప్రాంతంలో స్థానికులు ఇలా రియాక్ట్ అయ్యారు.

మెల్‌బౌర్న్‌-విక్టోరియా మధ్యలో ఉన్న ప్రాంతం పేరే డైమండ్ క్రీక్. ఆ ఏరియాలోని రోడ్ మధ్యలో ఇటీవల ఒక గుంత ఏర్పడింది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు, ప్రాంతంపై అవగాహన లేని వారు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ సమస్యపై ఫిర్యాదు చేసి స్పందించాలని కోరినా అధికారుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఈ సమస్య విక్టోరియా రోడ్స్‌ విభాగం కిందకు వస్తుందని స్థానిక కౌన్సిల్‌ చెప్పుకొచ్చారు. వారేమో ఇది మెట్రో ట్రైన్‌ సమస్యని విక్టోరియా రోడ్స్‌ చెప్పి తమది కాదని తోసిపుచ్చింది. ఎవరూ పట్టించుకోకపోవడంతో అధికారులు మాట మారుస్తుండటంతో విసుగెత్తిన స్థానికులు రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంతలో మొక్కను నాటారు.

అధికారుల నిర్లక్ష్యానికి.. లెక్కలేని తనాన్ని చూపించేలా.. కొందరు దీనిని ఫోటో తీసి సోషల్ మీడియాల్లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌ అయింది. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తూ.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కరెక్ట్ గా చేశారంటూ ప్రశంసలు వినిపిస్తున్నాయి. మరికొందరు సరదాగా.. మొక్క ముందు ఒక పార్క్‌ బెంచ్‌ కూడా ఉంచితే బాగుంటుందంటూ.. కామెంట్లు పెడుతున్నారు.