ట్రంప్‌ను సాగనంపుతారా? అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం

ట్రంప్‌ను సాగనంపుతారా? అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం

Resolution in the US House of Representatives for the impeachment of Trump : మరికొద్ది రోజుల్లో వైట్‌హౌస్ వీడనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను.. ఈలోగానే సాగనంపేందుకు డెమోక్రాటిక్‌ పార్టీ వరుస వ్యూహాలు అమలు చేస్తోంది. డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. క్యాపిటల్‌ హిల్‌పై దాడి చేయాలంటూ ఆయన తన మద్దతుదారులను ప్రోత్సహించారని, తిరుగుబాటుకు కారణమయ్యారని పేర్కొన్నారు. డెమోక్రాట్లు జమీ రస్కిన్‌, డేవిడ్‌ సిసిలైన్‌, టెడ్‌ లియూలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, 211 మంది మద్దతు తెలిపారు.

మొదట 25వ రాజ్యాంగ సవరణ అధికారాన్ని ఉపయోగించి అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ను కోరుతూ… ప్రతినిధుల సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్‌ భవనం క్యాపిటల్‌పై దాడి చేయాలని ట్రంప్‌ తన మద్దతుదారులను ఉసిగొల్పారని, అధ్యక్ష పదవికి ఆయన ఎంతమాత్రం యోగ్యుడు కాదని నాలుగు పేజీల తీర్మానంలో డెమోక్రాట్లు పేర్కొన్నారు. ఆయన్ను పదవిలో కొనసాగిస్తే… జాతీయ భద్రతకు, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు తప్పదని అందులో హెచ్చరించారు. అయితే దీన్ని రిపబ్లికన్‌ సభ్యులు అడ్డుకున్నారు.