బ్రిటన్ ఆర్థికమంత్రిగా నియమితులైన ఇన్ఫోసిస్ నారాయణ అల్లుడు

  • Published By: venkaiahnaidu ,Published On : February 13, 2020 / 02:07 PM IST
బ్రిటన్ ఆర్థికమంత్రిగా నియమితులైన ఇన్ఫోసిస్ నారాయణ అల్లుడు

బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రిగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ నియమితులయ్యారు. గతేడాది జులై నుంచి ట్రెజరరీ చీఫ్ గా పనిచేస్తున్న 39ఏళ్ల రిషి సునక్ ను ఆర్థికశాఖమంత్రిగా నియమించారు ప్రధాని బోరిస్ జాన్సన్. నార్త్ యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్ ఎంపీ విలియం హేగ్ దిగిపోతున్నట్టు 2014లో ప్రకటించారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ తమ అభ్యర్థిగా సునక్‌‌ను బరిలో దింపింది. 2016లో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా  అప్పటి ప్రధానమంత్రి థెరిసా మే నిర్ణయానికి రిషి మద్దతు పలికారు. ఆ తర్వాత ఆమె ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోతున్నట్టు ప్రకటించడంతో కొత్త ప్రధానిగా జాన్సన్‌కు జై కొట్టారు. 

రిషి సునక్ తండ్రి డాక్టర్, ఫార్మాసిస్ట్. 2009లో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి సునక్ జన్మించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ (PPE) చదువుకున్నారు. ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అక్షతతో ఆయనకు స్టాన్‌ఫర్డ్‌లోనే పరిచయం ఏర్పడింది.

ప్రస్తుతం రిచ్ మండ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రిషి సునక్…రాజకీయాల్లోకి రాకముందు పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ ఓ డైరెక్టర్.