NASA: పెరుగుతోన్న సముద్ర మట్టం.. చంద్రునిలో మార్పులు.. ప్రమాదకరంగా వరదలు

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావంతో సముద్ర నీటిమట్టం పెరిగితే రానున్న కాలంలో తుఫానుల జోరు మరింత ఉధృతంగా వుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

NASA: పెరుగుతోన్న సముద్ర మట్టం.. చంద్రునిలో మార్పులు.. ప్రమాదకరంగా వరదలు

Moon

Rising Sea Level: వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల ప్రభావంతో సముద్ర నీటిమట్టం పెరిగితే రానున్న కాలంలో తుఫానుల జోరు మరింత ఉధృతంగా వుంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండగా.. అమెరికాలోని నాసా శాస్త్రవేత్తల నేతృత్వంలోని ఒక అధ్యయనం 2030లలో యుఎస్ తీరప్రాంతాల్లో అధిక ఆటుపోట్లు వరదలు వస్తాయని అంచనా వేసింది. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా అమెరికాలో “హానికరమైన వరదలు” వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

అంతేకాదు.. శాస్త్రవేత్తలు చంద్రుని కక్ష్యలో వస్తున్న మార్పులు వల్ల భూమిపై చంద్రుని గురుత్వాకర్షణ శక్తి పెరుగుతుంది. ఇది అధిక ఆటుపోట్లను పెంచుతుంది, వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతాయి. ఇవి సముద్ర తీరప్రాంతాల్లో అలలు రోజువారీ సగటు కన్నా రెండు అడుగుల ఎత్తు ఎగసిపడినప్పుడు వరదలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుతం సెంటీమీటర్ల స్థాయిలోనే వున్న సముద్ర మట్టం పెరుగుతూ ఉంటే, కొంతకాలానికి మీటర్ల స్థాయికి పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రంలో పెరిగే ప్రతి సెంటీమీటర్‌ ఎత్తు నీటి మట్టం తీర ప్రాంతాలలో వరదలు, కోస్తా ప్రాంతాలకు కోతకు దారితీయటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎగసిపడే సముద్రం నీరు స్థానికంగా వీధుల్లోనూ, ఇళ్ళల్లోనూ చేరిపోవడంతో రోజువారీ పనులు స్తంభించిపోతాయి. ఈ హానికరమైన వరదలు 2030నాటికి తరచుగా వచ్చే ప్రమాదం ఉందని నాసా అధ్యయనం తెలిపింది. అధ్యయనం ప్రకారం, అమెరికా తీరప్రాంతంలో కనీసం ఒక దశాబ్దం పాటు మూడు నుండి నాలుగు రెట్లు ఎక్కువ ఆటుపోట్లు కనిపిస్తాయి. ఈ వరదలు సంవత్సరం అంతా సమానంగా రావని, కొన్ని నెలల్లోనే వరుసగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరిస్తోంది.

యునైటెడ్ స్టేట్స్‌లోని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్(NOAA) ప్రకారం, 2019లో, అమెరికా, అట్లాంటిక్ మరియు గల్ఫ్ తీరాలలో 600కి పైగా వరదలు సంభవించాయి. ఈ వరదలను హై టైడ్ వరదలు అని పిలుస్తున్నారు. అధిక ఆటుపోట్ల వల్ల ఈ వరదలు సంభవించాయి.

పెరుగుతున్న సముద్ర మట్టాలు మరియు వాతావరణ మార్పులతో ఈ ప్రమాదం ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ప్రకృతి మార్పులను పరిశీలిస్తుంటే మాత్రం 2030లో ఊహించిన అధిక సముద్ర మట్టాలతో కలిసి పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతుంది.