Russia Buses : రష్యా కీలక నిర్ణయం.. భారతీయులను తరలించేందుకు 130 బస్సులు

రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల సహా విదేశీయులను యుక్రెయిన్ నుంచి వెలుపలికి తరలించేందుకు ముందుకొచ్చింది(Russia Buses)

Russia Buses : రష్యా కీలక నిర్ణయం.. భారతీయులను తరలించేందుకు 130 బస్సులు

Russia Buses : రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వరుసగా 9వ రోజూ యుక్రెయిన్ పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ లో రోజురోజుకి రష్యా బలగాల దాడులు తీవ్రమవుతున్నాయి. రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా రష్యా దళాలు భారీ ఎత్తున క్షిపణి దాడులు చేస్తున్నాయి. దీంతో జనావాసాలపైనా ప్రభావం కనిపిస్తోంది. రష్యా దాడుల భయంతో ఇప్పటికే యుక్రెయిన్ నుంచి లక్షల మంది ప్రజలు దేశం విడిచి వెళ్లిపోయారు. భారతీయుల సహా అక్కడున్న విదేశీయులు స్వదేశాలకు చేరుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల సహా విదేశీయులను యుక్రెయిన్ నుంచి వెలుపలికి తరలించేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో తరలింపు చర్యల కోసం 130 బస్సులు(Russia Buses) ఏర్పాటు చేసింది. యుక్రెయిన్ లోని ఖార్కివ్, సుమీ నగరాల నుంచి విదేశీయులను రష్యాలోని బెల్గోరోడో ప్రాంతానికి బస్సుల ద్వారా తరలించనున్నారు. అక్కడి నుంచి విదేశీయులు తమ దేశాలకు వెళ్లొచ్చు.

Russia ukraine war : ‘బలి చేయటానికే ట్రైనింగ్‌లో ఉన్న మమ్మల్ని యుద్ధానికి పంపారు’ రష్యా సైనికుల ఆవేదన

కాగా, భారత్ ఇప్పటివరకు యుక్రెయిన్ పొరుగుదేశాలైన రొమేనియా, హంగేరీల మీదుగా విద్యార్థులను తరలిస్తూ వస్తోంది. ఇంకా యుక్రెయిన్ లో చాలామంది భారత విద్యార్థులు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. రష్యా తాజా నిర్ణయంతో వారందరూ క్షేమంగా యుక్రెయిన్ దాటే అవకాశముంది.

యుక్రెయిన్‌ నుంచి బయటపడి పొరుగు దేశాలకు చేరిన భారతీయులు 3వేల 726 మందిని గురువారం ఒక్కరోజే 19 విమానాల ద్వారా స్వదేశానికి తరలించినట్లు పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ‘ఆపరేషన్‌ గంగ’ పేరుతో నిర్వహించిన ఆపరేషన్ లో భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన విమానాలతో పాటు ప్రైవేట్ ఆపరేటర్ల విమానాలు కూడా పాలుపంచుకొన్నట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో మరో 7వేల 400 మందికి పైగా తరలిస్తామన్నారు. ఇంకా చాలామంది తమ సహచరులు యుక్రెయిన్‌లో చిక్కుకున్నట్లు స్వదేశానికి చేరుకున్న విద్యార్థులు తెలిపారు.

కాగా.. యుక్రెయిన్ నుంచి భారత్ కు తిరిగి వచ్చిన విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా వైద్య విద్య చదువుతున్న మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులు, మిగిలిన కోర్సు కాలాన్ని దేశీయ మెడికల్ కాలేజీల్లో పూర్తి చేసుకునే విధంగా ఉన్న అవకాశాలను పరిశీలించనుంది.

నేషనల్ మెడికల్ కౌన్సిల్, కేంద్ర ప్రభుత్వం దీనిపై చర్చిస్తున్నట్టు సమాచారం. యుక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులకు భారతీయ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసుకోవడం లేదంటే విదేశీ యూనివర్సిటీలలో అవకాశం కల్పించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాయి. వీరు కోర్సు ముగిసిన తర్వాత నీట్-ఎఫ్ఎంజీ పరీక్షలో తుది అర్హత సాధించాల్సి ఉంటుంది. కనీసం విదేశీ యూనివర్సిటీలకు బదిలీ చేసే విధంగా నిబంధనల్లో మార్పులు చేయాలంటూ ప్రభుత్వానికి సూచనలు వచ్చినట్టు సమాచారం.

Russia-Ukraine War : యుక్రెయిన్ లోని యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ ను స్వాధీనం చేసుకున్న రష్యా..

కాగా.. రష్యా బలగాల దాడిలో యుక్రెయిన్ కు తీవ్ర నష్టం జరుగుతోంది. అయినప్పటికి యుక్రెయిన్ కూడా అంతే స్థాయిలో విరుచుకుపడుతోంది. రష్యా సైన్యాన్ని, వారి యుద్ధ వాహనాలను ధ్వంసం చేస్తోంది. ఇప్పటిదాకా యుక్రెయిన్ సైన్యం దాడిలో 9వేల 166 మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది.

అంతేకాదు 251 రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని, 33 యుద్ధ విమానాలు, 37 హెలికాప్టర్లను కూల్చేశామని తెలిపింది. తమ దాడుల్లో రష్యాకు చెందిన 105 ఫిరంగులు, 939 సిబ్బందిని తరలించే వాహనాలు, 50 క్షిపణి లాంచర్లు, 2 పడవలు, 404 కార్లు, 60 ఇంధన ట్యాంకులు, 3 డ్రోన్లు, 18 యుద్ధ విమాన వినాశక మిసైల్ వ్యవస్థలను ధ్వంసం చేశామని యుక్రెయిన్ రక్షణ శాఖ చెప్పింది.