బిగ్ షాక్…ఒలింపిక్స్,ఫుట్ బాల్ వరల్డ్ కప్ నుంచి రష్యా ఔట్

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2019 / 02:20 PM IST
బిగ్ షాక్…ఒలింపిక్స్,ఫుట్ బాల్ వరల్డ్ కప్ నుంచి రష్యా ఔట్

రష్యాకు ఊహించని షాక్ తగిలింది. అగ్రదేశాల్లో ఒకటైన రష్యాపై ఒలింపిక్స్ క్రీడలు సహా అన్ని ప్రపంచ చాంపియన్‌షిప్‌ల నుంచి నిషేధం విధించింది ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (డబ్ల్యూఏడీఏ).  డోపింగ్ నేరాల కారణంగా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం విధించారు. దీంతో వచ్చే సమ్మర్ లో టోక్యోలో జరిగే ఒలంపిక్స్ తో పాటు ఖతార్ 2022 వరల్డ్ కప్ నుంచి రష్యా పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అయితే ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అప్పీల్ చేసుకునేందుకు రష్యాకు 21రోజుల సమయం ఉంది.

డోపింగ్ వివరాలు బయటికి పొక్కకుండా లాబొరేటరీ డేటాను రష్యా తారుమారు చేసినందుకుగానూ డబ్ల్యూఏడీఏ ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది. తప్పుడు ఆధారాలు చొప్పించడంతో పాటు…పాజిటివ్‌గా వచ్చిన డోపింగ్ టెస్టులకు సంబంధించిన ఫైళ్లను డిలీట్ చేసినట్టు నిర్ధారణ కావడంతో రష్యాపై డబ్ల్యూఏడీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ వేటు వేసింది.
 
పాజిటివ్‌గా తేలిన డోపింగ్ టెస్టు నివేదికలు డ్రగ్స్ మోసాలను బయటపెట్టేందుకు సహాయపడతాయి. వీటిని లేబరేటరీ డేటా నుంచి తొలగించినందుకు గానూ రష్యాపై నిషేధం విధించారు. కాగా రష్యాపై నిషేధం విధించేందుకు డబ్ల్యూఏడీఏ సభ్యులంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.