Russia : వరుసగా రెండో రోజు..రష్యాలో రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు

రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

Russia : వరుసగా రెండో రోజు..రష్యాలో రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు

Putin

Russia రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. రష్యాలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,042 పాజిటివ్ కేసులు, 669 కోవిడ్ మరణాలు నమోదైనట్లు బుధవారం రష్యా ప్రకటించింది. దేశంలో మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక కోవిడ్ మరణాలు ఇవేనని తెలిపింది. రష్యా అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటివరకు రష్యాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5,514,599గా ఉండగా..మరణాల సంఖ్య 135,214కి చేరింది.

కాగా, గత శుక్రవారం యూరో 2020(ఫుట్ బాల్ టోర్నమెంట్)క్వార్టర్ ఫైనల్ కి ఆతిథ్యమిచ్చిన సెయింట్ పీటర్స్ బర్గ్ కోవిడ్ హాట్ స్పాట్ గా మారింది. ఒక్క ఈ సిటీలోనే అత్యధికంగా కోవిడ్ మరణాలు నమోదవుతున్నాయి. రాజధాని మాస్కోలో పరిస్థితి ఆందోళనకరమైన నేపథ్యంలో అక్కడ కూడా కోవిడ్ ఆంక్షలు విధించబడ్డాయి. అయితే నమోదవుతున్న 90శాతం కోవిడ్ కేసులకు డెల్టా వేరియంటే కారణమని మాస్కో మేయర్ సెర్గియి సోబ్యానిన్ తెలిపారు. కాగా,మంగళవారం కూడా రష్యాలో 20,616 కోవిడ్ కేసులు, 652 కోవిడ్ మరణాలు నమోదైన విషయం తెలిసిందే.

ఇక,దేశంలో కోవిడ్ కేసులు,మరణాలు మళ్లీ పెరిగిపోతున్న నేపథ్యంలో రష్యన్లందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అధ్యక్షుడు పుతిన్ మరోసారి సూచించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు రష్యాలో చాలా మంది వెనకాడుతున్న నేపథ్యంలో…ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని..తాను కూడా దేశీయంగా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నానని మారథాన్ కాల్ ఇన్ షోలో పుతిన్ చెప్పారు.