గ్రహశకలానికి సీన్‌ కానరీ పేరు

  • Published By: bheemraj ,Published On : November 3, 2020 / 01:17 AM IST
గ్రహశకలానికి సీన్‌ కానరీ పేరు

Sean Connery asteroid : అంతరిక్షంలోని ఒక గ్రహశకలానికి ఇటీవల మరణించిన ప్రముఖ హాలీవుడ్‌ నటుడు సీన్‌ కానరీ పేరును అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పెట్టింది. జేమ్స్‌బాండ్‌ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఆయన గౌరవార్థం, ‘ది నేమ్‌ ఆఫ్‌ ద రోజ్‌’ చిత్రంలో ఆయన ప్రతిభకు గుర్తింపుగా ఒక ఉల్కకు ‘సీన్‌ కానరీ’ పేరు పెట్టినట్లు నాసా తెలిపింది. ‘సర్ సీన్ కానరీ ‘ఉల్కాపాతం’ (1979) చిత్రంలో నటించారు.



గ్రహశకలం ముప్పు నుండి భూమిని రక్షించడానికి నాసా చేసిన ప్రయత్నాలకు అందులో ఆయన నాయకత్వం వహించారు. నాసా తన మొదటి ప్లానెటరీ డిఫెన్స్ ఆఫీసర్‌ను నియమించడానికి దశాబ్దాల ముందుగానే ఆయన ఈ పాత్ర పోషించారు’ అని సోమవారం ఒక ట్వీట్‌ చేసింది. మార్స్‌, జుపిటర్‌ గ్రహాల మధ్య ఇటీవల కనుగొన్న ఉల్కకు సీన్‌ కానరీ పేరు పెట్టినట్లు తెలిపింది.



ఆయన పేరులాగే ఇది ఎంతో కూల్‌గా ఉందని అభివర్ణించింది. లెమ్మన్‌ శిఖరం పైనున్న 1.5 మీటర్ల సర్వే టెలిస్కోప్‌ ద్వారా ఆస్టరాయిడ్ 13070 సీన్‌ కానరీని ఈ ఏడాది ఏప్రిల్ 4న గుర్తించినట్లు నాసా తెలిపింది. ఈ ఉల్కకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.



ఇంగ్లాండ్‌లోని స్కాట్లాండ్‌లో సీన్‌ కానరీ జన్మించాడు. సీన్‌ కానరీ 90 సంవత్సరాల వయసులో (అక్టోబర్‌ 31, 2020)న కన్నుమూశారు. రంగస్థల నటుడిగా కెరీర్‌ను ఆరంభించిన ఆయన ‘బాండ్‌…జేమ్స్‌బాండ్‌’ అంటూ సిగ్నేచర్‌ స్టైల్ తో దాదాపు 4 దశాబ్దాల పాటు గూఢచారి జేమ్స్‌బాండ్‌ పాత్రలకు సీన్‌ కానరీ ప్రాణప్రతిష్ట చేశారు. 1962 నుంచి 1983 మధ్య ‘డాక్టర్‌ నో’ సినిమా మొదలుకొని ‘యూ ఓన్లీ లివ్‌ ట్వైస్‌’ వరకు 7 జేమ్స్‌బాండ్‌ సిరీస్‌ చిత్రాల్లో ఆయన నటించారు.

‘ది అన్‌టచబుల్స్‌’ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్నారు. మార్నీ, మర్డర్‌ ఆన్‌ది ఓరియంట్‌ ఎక్స్‌ప్రెస్‌, ది మెన్‌ హూ ఉడ్‌ బి కింగ్‌, ది నేమ్‌ ఆఫ్‌ ది రోజ్‌, హైలాండర్‌, ఇండియానా జోన్స్‌ అండ్‌ ది లాస్డ్‌ క్రూసేడర్‌, ది హంట్‌ ఫర్‌ రెడ్‌ అక్టోబర్‌, డ్రాగన్‌హార్ట్‌, ది రాక్‌, ఫైండింగ్‌ ఫారెస్టర్‌ చిత్రాలు పేరుతెచ్చాయి. 1989లో 59 ఏళ్ల వయసున్న అయన్ని పీపుల్స్‌మ్యాగజైన్‌ ‘సెక్సీయెస్ట్‌ మ్యాన్‌ అలైవ్‌’గా ప్రకటించింది.