చైనాలో కరోనా సెకండ్ వేవ్, ఒక్కరోజులో 57కేసులు, బీజింగ్‌లో భయాందోళనలు

కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ తగ్గినట్టు కనిపించింది. దీంతో చైనీయులు రిలాక్స్ అయ్యారు. ఇంతలోనే మళ్లీ

  • Published By: naveen ,Published On : June 14, 2020 / 07:24 AM IST
చైనాలో కరోనా సెకండ్ వేవ్, ఒక్కరోజులో 57కేసులు, బీజింగ్‌లో భయాందోళనలు

కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ తగ్గినట్టు కనిపించింది. దీంతో చైనీయులు రిలాక్స్ అయ్యారు. ఇంతలోనే మళ్లీ

కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్ తగ్గినట్టు కనిపించింది. దీంతో చైనీయులు రిలాక్స్ అయ్యారు. ఇంతలోనే మళ్లీ మహమ్మారి కలకలం రేపింది. రెండు నెలల తర్వాత మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్న(జూన్ 13,2020) ఒక్కరోజే 57 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 13 తర్వాత అత్యంత ఎక్కువ కేసులు నమోదు కావడం చైనీయులను కలవరపెడుతోంది. చైనాలో తగ్గిన కరోనా.. మళ్లీ విజృంభిస్తుండటంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈసారి చైనా రాజధాని బీజింగ్‌లో కరోనా కలకలం రేగింది.

మార్కెట్ మూసివేత, 10వేల మందికి కరోనా పరీక్షలు:
ఆదివారం ఒక్కరోజే బీజింగ్ నగరం సహా దేశంలో 57 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ హెల్త్ అథారిటీ వెల్లడించింది. చైనా రాజధాని నగరమైన బీజింగ్‌లో ఒక్కరోజే 36 కరోనా కేసులు బయటపడ్డాయి. బీజింగ్ దక్షిణ ప్రాంతంలో ఉండే అతిపెద్ద మాంసం, కూరగాయల జిన్‌ఫడీ(xinfadi) హోల్ సేల్ మార్కెట్‌‌లో కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిన్‌ఫడీ మార్కెట్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. మార్కెట్‌లో పనిచేస్తున్న దాదాపు 10 వేలమంది సిబ్బందికి వైరస్‌ నిర్ధారణ కోసం చేసే న్యూక్లియిక్‌ యాసిడ్‌ పరీక్షలను నిర్వహించారు. జిన్‌ఫడీ మార్కెట్‌కు సమీపంలో ఉన్న 11 స్థానిక ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించారు. కరోనా మళ్లీ ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలో టూరిజం ప్రయాణాలు, స్పోర్ట్స్ ఈవెంట్లను రద్దు చేశారు.

ఒక్క బీజింగ్‌లోనే 36 కేసులు:
తాజాగా నమోదైన 57 కేసుల్లో.. 38 కొత్త కేసులు స్థానికుల ద్వారా వ్యాపించినవేననీ… వాటిలో 36 బీజింగ్‌లో వచ్చాయని అధికారులు తెలిపారు. 19 విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల సోకినట్లు నిర్దారించారు. రెండు నెలల కాలంలో బీజింగ్‌లో రోజువారీ ఇన్ని ఎక్కువ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు రోజుకు ఆరు కేసుల దాకా వచ్చేవి. సడెన్‌గా కేసులు పెరగడంతో చైనా ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నగరంలోని స్కూల్స్ ను సోమవారం(జూన్ 15,2020) నుంచి తెరవాలన్న ఆలోచనను విరమించుకుంది.

జిన్‌ఫడీ మార్కెట్‌లో అసలేం జరుగుతోంది?
బీజింగ్‌లో నమోదవుతున్న కేసులు జిన్‌ఫడీ మార్కెట్‌కు ఏదో విధంగా అనుసంధానమై ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. వైరస్‌ సోకిన 52 ఏళ్ల బాధితుడు మాట్లాడుతూ.. గత రెండు వారాలుగా తాను బీజింగ్‌ను వదిలి వెళ్లలేదని, అలాగే విదేశాల నుంచి వచ్చిన వారిని కూడా కలవలేదని తెలిపాడు. అయితే, తాను జిన్‌ఫడీ మార్కెట్‌కు వెళ్లి వచ్చినట్టు చెప్పాడు. శనివారం నమోదైన ఆరు కేసుల్లో ముగ్గురు అదే మార్కెట్‌లో పని చేస్తున్నారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు ఇటీవల మార్కెట్‌ను సందర్శించగా, మరో ఇద్దరు మార్కెట్‌ సమీపంలో ఉన్న మాంసంపై పరిశోధన చేసే కేంద్రంలో పని చేస్తున్నారు. ఇందులో ఒకరు గతవారం మార్కెట్‌కు వెళ్లి వచ్చినట్టు వెల్లడించారు. దీంతో జిన్‌ఫడీ మార్కెట్‌ను మూసివేశారు. మే 30 నుంచి మార్కెట్‌ను సందర్శించిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 46 మందికి పాజిటివ్‌ వచ్చింది.

చైనాలో కరోనా సెకండ్ వేవ్:
ప్రస్తుతం చైనాలో మొత్తం పాజిటివ్ కేసులు 83వేల 132. మరణాలు 4వేల 634. యాక్టివ్ కేసుల సంఖ్య 129కి పెరిగింది. జూన్ 12న చైనాలో… కొత్తగా 11 కేసులొచ్చాయి. జూన్ 11న చైనాలో కొత్తగా 7 కేసులొచ్చాయి. దీన్ని బట్టీ చైనాలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనట్టే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదివరకు కరోనా పుట్టిన వుహాన్ నగర జనాభా కోటి 60 లక్షలు. అంత తక్కువ జనాభాలో మొత్తం 82వేల మందికి కరోనా సోకింది. మరి బీజింగ్ జనాభా దాదాపు 2కోట్ల 30 లక్షలు. దీంతో వారిలో ఎంతమందికి ఇప్పుడు కరోనా సోకుతుందో అని చైనా పాలకులు తెగ టెన్షన్ పడుతున్నారు. మొత్తంగా చైనాలో మళ్లీ కేసులు నమోదుకావడాన్ని రెండో దశ ఉద్ధృతిగా(సెకండ్ వేవ్) అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక వ్యాప్తి కారణంగానే కేసుల వృద్ధి జరుగుతున్నట్టు చెబుతున్నారు.