బుద్ధి మార్చుకోని పాకిస్తాన్, డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా, స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

  • Published By: naveen ,Published On : September 23, 2020 / 03:26 PM IST
బుద్ధి మార్చుకోని పాకిస్తాన్, డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా, స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

పాకిస్తాన్‌ తన దుష్టబుద్ధిని మార్చుకోవడం లేదు. ఆ దేశ సరిహద్దు నుంచి ఉగ్రవాదుల కోసం డ్రోన్ల ద్వారా ఏకే 47 లను జమ్మూకాశ్మీర్‌లో జారవిడుస్తోంది. తాజాగా అక్నూర్‌లోని ఓ గ్రామంలో దాడులకు వినియోగించే రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌ను గుర్తించారు పోలీసులు.

పాక్‌కు చెందిన డ్రోన్లు రాత్రిపూట ఓ గ్రామంలో ఆయుధాలు జారవిడుస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు చేశారు. జాద్‌ సోహాల్‌ గ్రామంలో రెండు ఏకే రైఫిళ్లు, మూడు మ్యాగజైన్లు, ఒక పిస్తోల్‌, 90 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

భారత సరిహద్దుకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్నూరులో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను కశ్మీర్‌ లోయలో ఉన్న ఉగ్రవాదులకు అందిస్తున్నట్టు భావిస్తున్నారు పోలీసులు.

దీని వెనుక జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. గతేడాది కూడా పంజాబ్‌ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. అప్పట్లో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయి డ్రోన్లను ధ్వంసం చేశారు.