Nepal PM : మొదట నిరాకరించి..నేపాల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన షేర్ బహుదూర్‌ దేవుబా

నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహుదూర్‌ దేవుబా ఆ దేశ కొత్త ప్రధానిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.

Nepal PM :  మొదట నిరాకరించి..నేపాల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన షేర్ బహుదూర్‌  దేవుబా

Nepal Pm

Nepal PM నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహుదూర్‌ దేవుబా ఆ దేశ కొత్త ప్రధానిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఐదవసారి నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా దేవుబా రికార్డు సృష్టించారు. 75 ఏళ్ల దేవుబా 1995-2018 మధ్యకాలంలో నాలుగుసార్లు ప్రధానిగా పనిచేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం కాకుండా కొంత ఆలస్యంగా షేర్ బహదూర్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.

సోమవారం నేపాల్ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షేర్ బహుదూర్‌ దేవుబాని కొత్త ప్రధానిగా నియమిస్తూ ఇవాళ రాష్ట్రపతి బిద్యా దేవా భండారి ప్రకటన విడుదల చేశారు. దీంతో మంగళవారం(జులై-13,2021) సాయంత్రం 5:45గంటలకు షేర్ బహదూర్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే తాను నియమించబడిన రాజ్యాంగ నిబంధన గురించి తన నియామకానికి సంబంధించిన నోటీసులో రాష్ట్రపతి పేర్కొనలేదన్న కారణంతో ప్రమాణస్వీకారం చేసేందుకు షేర్ బహదూర్ నిరాకరించారు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం దేవుబా..తప్పుని సరిదిద్దే వరకు తాను ప్రమాణస్వీకారం చేయబోనని రాష్ట్రపతి బిద్యా దేవీ భండారికి తేల్చి చెప్పారు. చివరికి రాష్ట్రపతి బిద్యా దేవీ ఆ నియాకమంలో మార్పులు చేయడంతో కొంత ఆలస్యంగా దేవుబా ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.

కాగా, నేపాల్‌ సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఐదు నెల‌ల వ్య‌వ‌ధిలో రెండోసారి ర‌ద్ద‌యిన నేపాల్ ప్ర‌తినిధుల స‌భ‌ను నేపాల్ సుప్రీంకోర్టు పున‌రుద్ధ‌రించడమే కాకుండా.. రెండు రోజుల్లోగా నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బ‌హ‌దూర్ దేవుబాను ప్ర‌ధానిగా నియ‌మించాల‌ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేపాల్ ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలీ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.