Pfizer Pill: కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ట్యాబ్లెట్ రూపంలో కోవిడ్ మందు.. త్వరలోనే అందుబాటులోకి

కరోనా రోగులకు ఇది గుడ్ న్యూస్ తో పాటు బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇకపై కరోనా బారిన పడితే ఆసుపత్రి పాలు కావాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే చికిత్స పొందే రోజులు రావొచ్చు. ఎందుకంటే.. ట్యాబ్లెట్ రూపంలో కరోనా మందు వస్తోంది.

Pfizer Pill: కరోనా రోగులకు గుడ్ న్యూస్.. ట్యాబ్లెట్ రూపంలో కోవిడ్ మందు.. త్వరలోనే అందుబాటులోకి

Pfizer Covid 19 Home Pill

Pfizer Covid 19 Home Pill : కరోనా రోగులకు ఇది గుడ్ న్యూస్ తో పాటు బిగ్ రిలీఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇకపై కరోనా బారిన పడితే ఆసుపత్రి పాలు కావాల్సిన అవసరం రాకపోవచ్చు. ఎంచక్కా ఇంట్లోనే చికిత్స పొందే రోజులు రావొచ్చు. ఎందుకంటే.. ట్యాబ్లెట్ రూపంలో కరోనా మందు వస్తోంది. అవును ట్యాబ్లెట్ రూపంలో కరోనా మందు మార్కెట్ లోకి రానుంది. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక ప్రకటన చేసింది. కరోనా మందుని ట్యాబ్లెట్ల(పిల్) రూపంలో అందుబాటులోకి తెస్తామంది. అంతేకాదు ఇందుకు సంబంధించిన మొదటి పిల్​ను మనుషులపై పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.

నోటి మాత్రపై ఫోకస్:
కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమర్థవంతమైన వ్యాక్సిన్‌ను రూపొందించిన ఫైజర్‌, తాజాగా ఔషధంపై దృష్టి సారించింది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా నోటి ద్వారా తీసుకునే ఔషధాన్ని వచ్చే ఏడాదిలోగా తీసుకొస్తామని వెల్లడించింది. నోటి ద్వారా, ఇంజక్షన్‌ రూపంలో తీసుకునే రెండు ఔషధాల (యాంటివైరల్‌)పై ప్రయోగాలు కొనసాగుతున్నాయని ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైజర్‌ యాజమాన్యం తెలిపింది.

కోవిడ్​ హోమ్​ క్యూర్​ పిల్స్​..ఇలా పని చేస్తాయి:
ఫైజర్‌ సంస్థ ఈ ప్రయోగాలను అమెరికా, బెల్జియంలోని తన ఫార్మా ల్యాబ్‌లలో ప్రారంభించింది. అమెరికాలో మొదటిసారిగా కరోనా టీకాను అందుబాటులోకి తెచ్చింది ఫైజర్​ సంస్థ. అన్ని ట్రయల్​ టెస్ట్​లలో ఈ టీకా సామర్థ్యం నిరూపితమైనందున వ్యాక్సిన్ వినియోగానికి అనుమతులు లభించాయి. అటువంటి సంస్థ ఇప్పడు కోవిడ్​ హోమ్​ క్యూర్​ పిల్స్​ రూపొందించే పనిలో పడింది. కరోనా రోగి లక్షణాలను అభివృద్ధి చేసినప్పుడు ఈ పిల్స్​ను తీసుకుంటే యాంటీవైరల్​గా పనిచేసి శరీరంలో వైరస్​ను నిర్మూలిస్తుందని ఫైజర్ సంస్థ చెబుతోంది. ఇది యాంటీవైరల్ ట్రీట్​మెంట్​గా పనిచేస్తుందని, కరోనా వైరస్ కట్టడికి పిల్​ రూపొందించడం ఇదే ప్రథమం అని ఫైజర్​ తెలిపింది.

ఈ ఏడాది చివరి నాటికే అందుబాటులోకి:
‘ప్రస్తుతం రెండు విధాల్లో యాంటీవైరల్‌ను తేవడానికి ప్రయత్నిస్తున్నాము. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తొలుత మాత్ర రూపంలో తేవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాము. తద్వారా కొవిడ్‌ బాధితులు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది’ అని ఫైజర్ సంస్థ సీఈఓ ఆల్‌బెర్ట్‌ బౌర్లా వెల్లడించారు. వ్యాక్సిన్‌ను తేవడానికి ఎంత వేగంతో పనిచేశామో ఔషధానికీ అంతే కృషి చేస్తున్నామని చెప్పారు.

నియంత్రణ సంస్థలు కూడా వేగంగా అనుమతిస్తే.. ఈ ఏడాది(2021) చివరి నాటికే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని బౌర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో ఉపయోగించే ఈ ఔషధం కొత్తగా వెలుగు చూస్తోన్న పలు వేరియంట్‌లపైనా సమర్థంగా పనిచేస్తుందనే విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు వచ్చిన అధ్యయనాల్లో పురోగతి కనిపించిందని.. వేసవి నాటికి వీటికి సంబంధించి పూర్తి అధ్యయన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఆల్‌బెర్ట్‌ బౌర్లా తెలిపారు.

మూడు దశల్లో టెస్టింగ్ ప్రక్రియ:
ఫైజర్​ పిల్స్ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్నాయి. వీటిని అమెరికా, బెల్జియం దేశాల్లో 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 60 మంది ఆరోగ్యవంతులపై ప్రయోగిస్తున్నారు. ఈ ప్రక్రియను మూడు దశలుగా విభజించారు. ఈ టెస్టింగ్​ ప్రక్రియ 145 రోజుల పాటు కొనసాగనుంది. దీని తర్వాత “స్క్రీనింగ్, డోసింగ్” కోసం మరో మరో 28 రోజులు సమయం పట్టనుంది. మొదటి దశలో పిల్​ ఇచ్చి దాని సైడ్​ ఎఫెక్ట్స్​ను అంచనా వేస్తారు.

అంతేకాక ఈ పిల్​ తీసుకున్న వారి శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చాయి.. ఏమైనా సమస్యలు తలెత్తుతాయా..? అనే విషయంపై అధ్యయనం చేస్తారు. ఇక రెండో దశ సరిగ్గా మొదటి దశ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే దీంట్లో రెండు డోసులు అందించి పరీక్షిస్తారు. మూడో దశ టాబ్లెట్‌ ద్రవ రూపంలో ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతానికి జంతువులపై ప్రయోగం చేసినట్లు ఫైజర్ వెల్లడించింది. ఈ యాంటీ వైరల్ పిల్​పై కరోనా ప్రారంభం నుంచి ప్రయోగాలు చేస్తున్నామని ఫైజర్ చెప్పింది.

సమర్థవంతంగా పని చేస్తున్న ఫైజర్ వ్యాక్సిన్:
ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 95శాతం సమర్థత చూపిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ప్రపంచంలో ఇప్పటికే పలు దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను అమెరికాలోనే 12కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక వ్యాక్సిన్‌ పంపిణీలో ప్రపంచంలోనే ముందున్న ఇజ్రాయెల్‌లోనూ ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అందించారు.

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా అంటేనే గజగజ వణికిపోతున్నారు. దేశంలో ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్‌ కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ఏకైక మార్గం వ్యాక్సిన్‌. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది.